వ్యంగ్యాన్ని, హాస్యాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తే .. చమత్కారం పుడుతుంది. ఈ విద్య లో బాగా ఆరితేరిన వారు ముళ్ళపూడి వెంకటరమణ. ఆయన చమక్కులు.. చురుక్కులు.. చెణుకులు ఒకప్పటి పాఠకులకు , సినీ ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన రాసే ప్రతీ డైలాగులోనూ జీవితముంటుంది. జీవిత సారముంటుంది. బాపుతో సావాసం ఆయన జీవితానికి పరమార్ధాన్ని ఏర్పరిచింది. ముళ్ళపూడివారి రచనా చమత్కృతికి బాపు తెరకెక్కించిన చిత్రాలే నిదర్శనం.
ముళ్లపూడి వెంకటరమణ 1931లో ధవళేశ్వరంలో జన్మించారు. ఊహ తెలిసీ తెలియని వయసులోనే తండ్రిని కోల్పోయారాయన. ధవళేశ్వరం ఆనకట్టలో తండ్రి క్యాష్ కీపర్. తండ్రి గతించాక, ఉదరపోషణార్థం తల్లి ధవళేశ్వరం నుంచి మద్రాసు మహానగరానికి మకాం మార్చారు. అక్కడ ఒక ఇంటిలో మెట్ల కింద చిన్న గదిలో అద్దెకు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. ‘మా అమ్మ నాకు జన్మరీత్యా అమ్మ. జీవితం రీత్యా ఫ్రెండు, గురువు, భయం లేకుండా బతకడం నేర్పిన గురువు, తెచ్చుటలో కన్నా, ఇచ్చుటలో ఉన్నహాయిని చూపిన దైవం’ అని తన స్వీయచరిత్ర కోతికొమ్మచ్చిలో రాసుకున్నారు రమణ.
ఆంధ్రపత్రికలో సినిమా వార్తలు రాస్తున్న సమయంలో రమణ సమీక్షలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. అక్కినేని వంటి అగ్రనటులు, ఆత్రేయ వంటి రచయితలు, నాగిరెడ్డి చక్రపాణి వంటి నిర్మాతలు రమణ సినీ సమీక్షలను ఆసక్తికరంగా చదివేవారు. సినీ నిర్మాత డీబీ నారాయణ తాను తీస్తున్న ‘దాగుడు మూతలు’ సినిమాకు రచన చేయమని ముళ్లపూడిని కోరారు. చాలాకాలం తప్పించుకు తిరిగిన రమణ ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, దాగుడుమూతలు షూటింగ్ కారణాంతరాల వల్ల లేటు కావడంతో, డూండీ ఎన్టీ రామారావుతో నిర్మించిన రక్త సంబంధం ఆయనకు మొదటి సినీ రచన అయింది. రెండో సినిమా కూడా ఎనీఆ్టర్ నటించిన గుడిగంటలు, మూడో సినిమా అక్కినేని నటించిన క్లాసిక్ మూగమనసులు.. మూడూ సూపర్ హిట్ సినిమాలే కావడంతో రమణ సినీ జీవితం ఊపందుకుంది. సొంతంగా సినిమాలు కూడా నిర్మించారు. సాక్షి, బంగారుపిచుక, బుద్ధిమంతుడు, అందాలరాముడు, గోరంతదీపం, ముత్యాలముగ్గు, సీతాకల్యాణం, సంపూర్ణ రామాయణం, పెళ్ళి పుస్తకం’.. కొన్ని హిట్లు మరికొన్ని ఫట్లు అయినా, రెంటినీ సమానంగా భావించే స్థితప్రజ్ఞుడు ఆయన.. రామాయణాన్ని అమితంగా ప్రేమించే రమణ చివరి రచన కూడా శ్రీరామరాజ్యం కావడం, ఆయన జీవితకాల నేస్తం బాపు తుది క్షణంలో ఆయన పక్కనే ఉండడం చెప్పుకో తగ్గ అంశాలు. నేడు ముళ్ళపూడి వెంకటరమణ జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘననివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.