ఆయన స్వరాలు.. దక్షిణాది సినీ సంగీతానికే వరాలు. ఆయన గీతాలు.. రసహృదయుల్ని రంజిపచేసి తరింపజేసే ఆణిముత్యాలు. అప్పటి తరం ప్రేక్షకులకి జీవం గలిగిన సంగీతాన్ని సిద్ధింప చేసిన స్వరమాంత్రికుడు ఆయన. పేరు యం.యస్.విశ్వనాథన్. ఆయన పాటల్ని విని ముగ్ధులైన వారు ఆయన్ని మధుర స్వర విశ్వనాథన్ అని పిలుచుకొనేవారు. అన్ని భాషల్లోనూ కలుపుకొని పన్నెండు వందల సినిమాలకు పైగా అద్భుతమైన సంగీతాన్ని అందించిన కలైమామణి ఆయన.
సిఆర్ సుబ్బురామన్, టి.ఆర్ పాప తనకు సినీ సంగీత గురువులని ఎమ్మెస్ గర్వంగా చెప్పుకుంటారు. గురువు సుబ్బరామన్ హటాత్తుగా మరణించడంతో, అర్థంతరంగా ఆగిపోయిన అతని ఆరేడు సినిమాలను విశ్వనాథన్ పూర్తి చేసి గురువు రుణం తీర్చుకున్నారు. ఒకరోజు మిడ్‌ల్యాండ్ థియేటర్‌లో రామమూర్తితో కలిసి సినిమా చూసి మౌంటురోడ్డులో నడుస్తుండగా ‘‘శంకర్ − జైకిషన్‌లాగా మనమిద్దరం జంటగా ఎందుకు మ్యూజిక్ డైరెక్షన్ చేయకూడదు?’’ అని ఎమ్మెస్ ప్రతిపాదించగా ‘‘సరే’’ అనుకొని వారిద్దరూ జట్టు కట్టారు. వారిద్దరూ కలిసి పనిచేసిన తొలిసినిమా ‘పణం’లో వీరి పేర్లు ‘‘రామూర్తి − విశ్వనాథన్’’ అని వుంది. ఆ తర్వాత ‘‘విశ్వనాథన్ − రామూర్తి’’గా పేరు మార్చుకొని విజయవంతమైన జంటగా 1965 వరకు 500 సినిమాలకు పైగా పనిచేశారు. ఇద్దరూ కలిసి పనిచేసిన ఆఖరి సినిమా ‘ఆయిరత్తిల్ ఒరువన్’. వీరి జంట విడిపోయాక 1965 − 2013 మధ్య కాలంలో విశ్వనాథన్ ఒక్కడే 700 సినిమాలకు పైగా సంగీత దర్శకునిగా పనిచేశారు. విశ్వనాథన్ సంగీతంలో కనిపించని ఆకర్షణ ఏదో వుంది. కాలంతోబాటు ఎమ్మెస్ తన సంగీత పంథా కూడా మార్చుకున్నారు. యువతరాన్ని ఆకర్షించగలిగారు. అలాగని క్లాసికల్ టచ్‌ని విడనాడలేదు. ప్రముఖ సంగీత దర్శకులు జికె వెంకటేష్, ఆర్ గోవర్దన్, శంకర్ గణేష్, హెన్నీ డేనియల్ ఎమ్మెస్ జంటకు సహాయకులుగా వుండేవారు. ఇక తెలుగు సినీ రంగ విషయానికి వస్తే 1955లో విశ్వనాథన్ ‘సంతోషం’ సినిమాకు సంగీతం సమకూర్చారు. స్వతంత్ర నిర్దేశకునిగా అనేక విజయవంతమైన తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. ఆయన చేసిన సంగీతానికి సింహభాగం పాటలు రాసింది ఆచార్య ఆత్రేయ. ఎమ్మెస్ ప్రజాదరణ పొందిన పాటలు తెలుగులో కోకొల్లలు. ‘తనువు కెన్ని గాయాలైనా’, ‘బుజ్జిబుజ్జి పాపాయి’ ‘రేపంటి రూపం కంటీ’, ‘తలచినదే జరిగినదా’, ‘అందాల ఓ చిలకా’, ‘కోడి ఒకకోనలో’, ‘నన్ను ఎవరో తాకిరి’ , ‘ఏమంటున్నది ఈ గాలి’, ‘తాళికట్టు శుభవేళా’ , ‘ఏ తీగ పూవునో’, ‘సన్నజాజులోయ్’ , ‘అటుఇటు కాని హృదయము తోటి’, ‘నువ్వేనా సంపంగి పువ్వుల’ , ‘కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు’ , ‘కన్నె పిల్లవని కన్నులున్నవని’ , ‘కదిలే మేఘమా’, ‘పల్లవించవా నా గొంతులో’ పాటలు ఉదాహరణకు కొన్ని మాత్రమే. నేడు యం.యస్.విశ్వాథన్ వర్ధంతి. ఈ సందర్భంగా ఆ మహా సంగీత దర్శకుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.