Bollywood : 1971లో దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కామ్’ ఇప్పుడు వెండితెరపైకి రానుంది. ఎలిప్సిస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సంచలన కుంభకోణం ఆధారంగా ఒక సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటించింది. చరిత్రలోనే అత్యంత సంచలన కుంభకోణాలలో ఒకటిగా పేరుగాంచిన ఈ స్కామ్, ‘ఇందిరాగాంధీ వాయిస్ స్కామ్’ అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే దీని కథ చాలా నాటకీయంగా ఉంది.

1971లో ఢిల్లీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్ స్ట్రీట్ బ్రాంచ్‌లో చీఫ్ కాషియర్‌గా పనిచేస్తున్న వేద్‌ ప్రకాశ్ మల్హోత్ర ఒక షాకింగ్ ఫోన్ కాల్‌ను అందుకున్నాడు. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ప్రధాన మంత్రి తాను ఇందిరా గాంధీని అని చెప్పి, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న రహస్య మిషన్‌కు రూ. 60 లక్షలు అవసరమని చెప్పాడు. డబ్బును సిద్ధం చేసి, నిర్ణీత వ్యక్తికి అందించాలని, తరువాత రసీదు కోసం పార్లమెంటు హౌస్‌కు రావాల్సి ఉంటుందని సూచించాడు.

మల్హోత్ర, అది ప్రధాన మంత్రి వాయిస్ అని నమ్మి, డబ్బును అందించాడు. కానీ, రసీదు కోసం పార్లమెంట్‌కు వెళ్ళినప్పుడు, అతను మోసపోయాడని తెలుసుకున్నాడు. ఇందిరా గాంధీ ఎవరికీ ఫోన్ చేయలేదు, ఆ డబ్బు గురించి ఆమెకు తెలియదని తేలింది. మోసానికి గురైన మల్హోత్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు “ఆపరేషన్ తుఫాను” అనే పేరుతో చాలా వేగంగా దర్యాప్తు చేయబడింది. దర్యాప్తులో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి, భారత సైనిక గూఢచర్య వ్యవస్థతో కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. ఈ సంచలన కుంభకోణం ఇప్పుడు సినిమాగా తెరకెక్కడం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ చిత్రం ఎలా ఉంటుందో, ఎంతవరకు నిజానికి దగ్గరగా ఉంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!