Mohna Lal : 2019లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “లూసిఫర్” సినిమాకి సీక్వెల్ గా “ఎల్2 ఎంపురాన్” సినిమా తెరకెక్కింది. మోహన్ లాల్ కథానాయకుడిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మంగళవారం మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది.

“లూసిఫర్”, “బ్రో డాడీ” సినిమాల తర్వాత ఈ కాంబో నుంచి వస్తున్న మూడో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మలయాళ సినిమా రంగంలోకి అడుగు పెడుతోంది. ఫస్ట్ లుక్ లో మోహన్ లాల్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించారు. “లూసిఫర్” లో స్టీఫెన్ నెడుంపల్లి పాత్రలో నటించిన మోహన్ లాల్ ఈ సినిమాలో ఖురేషి అబ్రహాం పాత్రలో కనిపించనున్నారు. ఈ సీక్వెల్ లో ఆయన ఎలా ఖురేషి అబ్రహాం గా మారారనేది కథాంశం గా ఉంటుందని తెలుస్తోంది.

స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తిరువనంతపురంలో జరుగుతోంది. త్వరలోనే గుజరాత్, యూఏఈ లోనూ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మోహన్ లాల్ తో పాటు టోవినో థామస్, మంజు వారియర్, నందు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు దీపిక్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. 2025లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!