విలక్షణమైన పాత్రలు.. విభిన్న తరహా కథలు.. వాటికి తగ్గ మేకోవర్.. పాత్రలో పరకాయ ప్రవేశం.. పాత్రను ఓన్ చేసుకొనే తీరు .. ఎవరినైనా ఆశ్చర్యపరుస్తాయి. నాలుగు పదుల సినీ కెరీర్ లో దక్షిణాది తెర విస్తుబోయే రీతిలో అన్ని రకాల పాత్రల్ని పోషించి మెప్పించారు ఆయన. పెక్యులర్ వాయిస్ .. వైవిధ్యమైన రీతిలో పలికే డైలాగ్స్ .. మలయాళీలను మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి. ఆయన పేరు మోహన్ లాల్.
కేరళ లోని పత్తినం తిట్ట జిల్లాకు చెందిన ఏలంతూర్ మోహన్ లాల్ స్వగ్రామం. తండ్రి విశ్వనాథన్ నాయర్ ప్రభుత్వ ఉద్యోగి. తిరువనంతపురంలో పెరిగిన లాల్.. అక్కడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. చిన్నప్పటినుంచీ నాటకాల మీద అపరిమితమైన ఆసక్తి. ఆ కారణంతోనే సినిమాల్లో నటుడిగా చాలా రకాల ప్రయత్నాలు చేశారు. 1978 లో తిరనోట్టం అనే సినిమాతో మాలీవుడ్ లో నటుడిగా ప్రవేశించిన మోహన్ లాల్.. ఆ సినిమా విడుదల కాకపోవడంతో.. ‘మంజిల్ విరింజ పోక్కల్’ అనే మూవీతో తొలిసారి తెరమీద కనిపించారు. అందులో ఏకంగా ఆయన విలన్ గా నటించి మెప్పించారు. (ఈ సినిమా ప్రేరణతోనే కోడి రామకృష్ణ ‘పెళ్లి’ సినిమా తెరకెక్కించారు) ఆ సినిమా సూపర్ హిట్టవ్వడంతో మోహన్ లాల్ అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఎన్నో సూపర్ హిట్టు చిత్రాలతో మోహన్ లాల్ .. మాలీవుడ్ ప్రేక్షకులకు అభిమాన లాలేట్టన్ గా మారిపోయారు. ఎంతో మంది ప్రతిభావంతమైన దర్శకులు మోహన్ లాల్ ను కంప్లీట్ యాక్టర్ గా తీర్చిదిద్దారు. ఇప్పటివరకూ అన్ని దక్షిణాది భాషల్లోనూ దాదాపు గా 340 పై చిలుకు చిత్రాల్లో నటించిన మోహన్ లాల్ .. 5 సార్లు జాతీయ అవార్డు కైవసం చేసుకోవడం ఆయనకు మాత్రమే సాధ్యమైన రికార్డు. ఇప్పటికీ యంగ్ హీరోలతో పోటీ పడుతూ.. మోహన్ లాల్ .. మాలీవుడ్ లో ఇప్పటికీ మెగాస్టార్ గా కొనసాగుతున్నారు. నేడు మోహన్ లాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ కంప్లీట్ యాక్టర్ కు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే మోహన్ లాల్ ..