Mohanbabu : మంచు విష్ణు హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం “కన్నప్ప”. శివ భక్తుడు కన్నప్ప పాత్రలో విష్ణు నటించిన ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్ కథానాయిక. ప్రభాస్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మోహన్ లాల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఈ చిత్ర టీజర్ శుక్రవారం హైదరాబాద్ లో విడుదలైంది. శివనామ స్మరణతో మొదలై ఆ నామస్మరణతోనే ముగిసిన టీజర్ ఆద్యంతం అలరించింది. తిన్నడు పాత్రలో విష్ణు పరిచయమైన తీరు, యుద్ధ ఘట్టాల్లో ఆయన చేసిన సాహసాలు, ఆఖర్లో అతిథి పాత్రల్లో ప్రభాస్, అక్షయ్ కుమార్ లు కనిపించడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
“కృష్ణంరాజు, ప్రభాస్ తో ఈ సినిమా తీయాలని అనుకున్నాం. కానీ, విష్ణు కూడా ప్రభాస్ కి సరిపోతాడని అనిపించింది. ఈ చిత్రం ప్రజల సినిమా. దేశంలోని అగ్ర నటులు ఈ సినిమాలో నటించారు. వారందరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. కన్నప్ప చిత్రం భక్తి చిత్రమే కాదు. ఒక చరిత్ర ” అని మంచు మోహన్ బాబు అన్నారు.
“ఇది నా కలల సినిమా. నా బిడ్డతో సమానం. ఒక నటుడిగా ఈ చిత్రం నాకు గౌరవాన్ని పెంచుతుంది. ఈ సినిమా కోసం చాలా మంది నాకు సాయం చేశారు. వారికి ధన్యవాదాలు. భక్తుడు కాక ముందు కన్నప్ప ఎలా ఉండేవాడో నటించడం సవాల్ గా అనిపించింది. మంచి సినిమా తీయాలనే లక్ష్యంతో బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా దీన్ని నిర్మించాం.” అని మంచు విష్ణు అన్నారు.