కరోనా లాక్ డౌన్ కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు ఇంట్లో తమ భార్యలకు పనుల్లో సహాయపడుతున్నారు. ఇంట్లోని మ‌హిళ‌ల‌తో ఇంటి ప‌నులు చేయించ‌కండి అంటూ ‘అర్జున్ రెడ్డి’ డైరెక్ట‌ర్ సందీప్ వంగా మ‌గ‌వారికి ‘బీ ద రియ‌ల్ మేన్‌’ అనే ఛాలెంజ్ విసిరారు. ఆ ఛాలెంజ్ లను స్వీకరించి చక చకా చేస్తూ మరొకరికి ఛాలెంజ్ లు విసురుతున్నారు. ఒకవైపు హీరోయిన్లు పేపర్, పిల్లో ఛాలెంజ్ అంటూ చేస్తుంటే, హీరోలు మాత్రం ఇంట్లో పనులు చేస్తూ బి ది రియల్ మ్యాన్ అంటూ ఛాలెంజ్ లు చేస్తున్నారు.

అయితే ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మరో కొత్త సవాల్‌ను సృష్టించారు. ఇది కూడా ఈ లాక్‌డౌన్‌ వేళ అందరికీ ఉపయోగకరమైన సవాల్‌లానే నిలవనుంది. ఇంతకీ ఆయన క్రియేట్‌ చేసిన ఈ ఛాలెంజ్‌ ఉద్దేశం ఏంటంటే.. ఈ విరామ సమయంలో తమకు బాగా నచ్చిన కొన్ని పుస్తకాలను మళ్లీ చదివి వాటి ఫొటోలను ట్విటర్‌ వేదికగా పంచుకోవాల్సి ఉంటుంది. కీరవాణి కూడా ప్రస్తుతం తాను మళ్లీ చదివిన ‘పోలీసు చమత్కారాలు, ‘స్టీఫెన్‌ కింగ్‌: నైట్‌ షిఫ్ట్‌’, ‘కన్యాశుల్కం’, ‘వంశీ’ పుస్తకాలను పంచుకున్నారు. దర్శకులు రామ్‌ గోపాల్‌వర్మ, గుణశేఖర్, ఎస్‌.ఎస్‌ కంచిలను వాళ్లు చదివిన నాలుగు మంచి పుస్తకాలను ట్విటర్‌ వేదికగా పంచుకోవాలని సవాల్‌ చేశారు. పుస్తక పఠనం పట్ల అందరిలో అవగాహన పెంచే ఉద్దేశంతో కీరవాణి ఈ కొత్త ఛాలెంజ్‌ను సృష్టించారు.

Leave a comment

error: Content is protected !!