ఎవరిగొంతునైనా..ఎలాంటి వాయిస్ నయినా ఇట్టే అనుకరించగలిగిన ధ్వన్యనుకరణ కళాకారుడు వంగిపురం హరికిషన్. ఆయన వయసు 57 ఏళ్లు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబందిత అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఈరోజు పరిస్థితి చేయి దాటి మరణించారు. ఆయనను అనారోగ్య కారణాలతో సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే ఆయన తుది శ్వాస విడిచారు. ఏలూరులో జన్మించిన హరికిషన్ కు మిమిక్రీనే సర్వస్వం.
8 సంవత్సరాల వయసులోనే తమ గురువుల కంఠాల్నీ, బంధువుల కంఠాల్నీ అనుకరించడం ప్రారంభించి మెల్లగా సమాజంలోని ప్రముఖుల, క్రికెట్ కళాకారుల, రాజకీయ నాయకుల, సినీ తారల, కవుల, గాయకుల గొంతును అనుసరించడం నేర్చుకున్నారు హరికిషన్. దేశ విదేశాల్లో 10 వేలకు పైగా మిమిక్రీ ప్రదర్శనలు ఇచ్చారు. పలు టీవీ కార్యక్రమాల్లో , సీరియల్స్, సినిమాల్లో నటించారు. హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్ హైస్కూల్‌లో 12 ఏళ్ళపాటు మ్యాథ్స్, ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగానూ , తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో మిమిక్రీ లెక్చరర్‌గానూ పనిచేశారు. మిమిక్రీ మాస్టర్, ధ్వనిమిషన్ – హరికిషన్, స్వర్ణ ధ్వన్యనురణ దిగ్గజం, బహు స్వర కంఠీరవ, శత కంఠ ధ్వన్యనుకరణ ధురీణ వంటి అనేకానేక బిరుదులను, సన్మానాలను పొందారు. మిమిక్రీని కూడా వృత్తిగా తీసుకోవచ్చని త్రికరణ శుద్ధిగా విశ్వసించి నిరూపించారు హరికిషన్. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియచేశారు.