సహజత్వానికి పెట్టింది పేరు ఆయన. మంచి పాత్రలైనా , చెడ్డ పాత్రలైనా , గంభీరమైన పాత్రలైనా  ,హాస్య పాత్రలైనా .. మరెలాంటి పాత్రలనైనా అవలీలగా చేయగలిగే సత్తా కలిగిన నాటి మేటి నటుడాయన. పేరు మిక్కిలినేని.  రంగస్థలం నుంచి సినీ రంగానికి తరలి వచ్చిన మిక్కిలి ప్రతిభాశాలి ఆయన.

రచయితగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, రాజకీయ నేతగా కూడా ప్రసిద్ధుడు మిక్కిలినేని. గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించిన  మిక్కిలినేని పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్రానంతరం నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. నాటక రంగానికి చెందిన 400 మంది నటీనటుల జీవితాలను ‘నటరత్నాలు’ పేరిట అక్షరాల్లో పొందుపరిచిన రచయిత ఈయన. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు. మిక్కిలినేనిని ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. కె.ఎస్‌.ప్రకాశరావు దర్శకత్వంలో 1949లో వచ్చిన ‘దీక్ష’తో మిక్కిలినేని సినీప్రస్థానం మొదలైంది. బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన ‘భైరవద్వీపం’ వరకూ 400లకు పైగా తెలుగు చిత్రాల్లో నటించారు. కమ్యూనిస్ట్ గా, గ్రంథాలయ, హేతువాద ఉద్యమాలలో క్రియాశీల కార్యకర్తగా సేవలందిచారు. తెలుగువారి జానపద కళారూపాలు అనే పుస్తకాన్ని కూడా మిక్కిలినేని వెలువరించారు. మన పగటి వేషాలు’, ‘ఆంధ్రుల నృత్యకళా వికాసం’ తదితర పరిశోధనాత్మక గ్రంథాల రచయిత. ఇలా..  బహుముఖంగా సేవలందించిన మిక్కిలినేని జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ ప్రతిభాశాలికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!