ఆయన పగలే వెన్నెలలు కురిపించగలడు. ఆ వెన్నెలలో ప్రేక్షక హృదయాల్ని లాహిరి లాహిరి లాహిరిలో అంటూ.. నౌకా యానంలో తేలియాడించగలడు. భూమి పై స్వర్గాన్ని, స్వర్గంలో మరో భూమిని ప్రతిష్ఠించగలడు. బండరాళ్ళను సైతం పాటలతో కరిగించగలడు. ఒకేసారి ఒకేరూపంలోని అనేకమందితో సంగీత కచేరి చేయించగలడు. ఆయన కన్నుపడితే కెమేరా లెన్స్ అందమైన దృశ్యాలతో పులకించిపోతుంది. పాషాణాలు సైతం అప్సరసలైపోతారు. టోటల్ గా ఈ వెండితెర ప్రపంచమే మాయా బజారైపోతుంది. ఆ ఛాయాగ్రాహకుని పేరు మార్కస్ బార్ ట్లే. ఆంగ్లో ఇండియన్ . శ్రీలంకలో జన్మించినా మద్రాస్ లో పెరిగాడు.
ఈయన తండ్రికి స్టిల్ ఫోటోగ్రఫీ అభిరుచి ఉండేది. అది బార్ట్లేకి అబ్బింది. పదమూడేళ్ల వయసులోనే బ్రౌనీ కెమెరాతో ఫోటోలు తీసేవాడు. దానికి తండ్రి పోత్సాహము కూడా తోడయ్యింది. ఇతడికి నెలకొక ఫిల్ము రీలు కొనిచ్చి దానితో కనీసం ఎనిమిది ఫోటోలైన మంచివి తియ్యాలని షరతు పెట్టేవాడు. ఈ విధంగా ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చదువును లక్ష్యపెట్టలేదు. అప్పటినుంచి ఆయన ఫోటో గ్రఫీనే సర్వస్వంగా భావించి అదే తన భవిష్యత్ కు బంగారు బాట వేస్తుందని నమ్మాడు. ఛాయా గ్రహణం మీదున్న ఆసక్తే ఆయన్ను సినీ రంగం వైపుకు మళ్ళించింది. బార్ట్లే 1945 బి.యన్.రెడ్డి స్వర్గసీమ సినిమాతో తెలుగు చలనచిత్ర రంగములో ప్రవేశించాడు. డిజిటల్ టెక్నాలజీ లేని రోజుల్లో మాయాబజార్, పాతాళ భైరవి లాంటి మరెన్నో అద్భుతమైన చిత్రాలు తీసి ఆనాటి మేటి సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నాడు. బార్ట్లే పనిచేసిన చివరి తెలుగు సినిమా చక్రవాకం. ఈయన 1978 లో కాన్స్ లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవములో మలయాళ చిత్రం చెమ్మీన్కు గాను బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు 1980వ దశకంలో సినిమాలనుండి విరమించుకున్నా, కెమెరాల మీద ప్రేమతో, కెమెరాలు సర్వీసింగు చేయటమనే హాబీతో శేషజీవితాన్ని గడిపాడు. నేడు మార్కస్ బార్ ట్లే జయంతి. ఈ సందర్భంగా ఆ మహా ఛాయా గ్రహకుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.