Shopping Cart 0 items - $0.00 0

మనుషులు మారాలి

 

నటభూషణ్ శోభన్ బాబు నటజీవితంలో మరపురాని హృద్యమైన చిత్రం ‘మనుషులు మారాలి’. నిజానికి ఈ సినిమా ఘన విజయం టాలీవుడ్ లో ఆయన కెరీర్ కు గట్టి పునాదులు వేసిందని చెప్పుకోవాలి.  జెమినీ స్టూడియోస్ నిర్మాణం లో వి.మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పటి ప్రేక్షకులచేత కన్నీళ్ళు పెట్టించింది. శారద కథానాయికగా నటించగా.. కాంచన, హరనాథ్, గుమ్మడి, కృష్ణంరాజు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. 1969 లో విడుదలైన ఈ సినిమా కథానాయిక శారదకు చాలా మంచి పేరు పెట్టింది. కె.వి.మహాదేవన్ సంగీత సారధ్యంలోని పాటలు అప్పటి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించింది.  వాస్తవానికి ఈ సినిమా 1968లో వచ్చిన మలయాళ సూపర్ హిట్టు చిత్రం ‘తులాభారం’ చిత్రానికి రీమేక్ వెర్షన్. ప్రముఖ మలయాళ రచయిత తోప్పిల్ భాసి అదే పేరుతో రచించిన నాటకాన్ని సినిమాగా తెరకెక్కించి.. మలయాళీల చేత కన్నీళ్ళు పెట్టించారు. ప్రేమ్ నజీర్, శారద, షీలా ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి రెండు నేషనల్ అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి శారదకి ఉత్తమనటిగా ఊర్వశి అవార్డును తెచ్చిపెట్టడం విశేషం. అలాగే ఇదే సినిమాను హిందీలో సమాజ్ కో బదల్ దాలో గా రీమేక్ చేశారు. ఇందులో మరో విశేషమేంటంటే.. ఈ సినిమా మూడు వెర్షన్స్ లోనూ శారదే కథానాయిక గా నటించి మూడింట్లోనూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తనకిష్టం లేని పెళ్లి చేసుకొన్న ఒక స్త్రీ .. ప్రమాదంలో భర్త చనిపోతే.. దారుణమైన ఆర్ధిక ఇబ్బందులకు గురవుతుంది. ఆకలితో ఏడుస్తున్న తన బిడ్డలకు  అన్నం కూడా పెట్టలేని దయనీయమైన స్థితిలో ఆమె .. విషం ఇచ్చి తన పిల్లలిద్దరినీ చంపేసి, తానూ ఆత్మహత్యా ప్రయత్నం చేసి విఫలమవుతుంది. తన బిడ్డల్ని చంపిన నేరానికి ఆమెకు  కోర్ట్ శిక్ష విధిస్తుంది. అప్పటి ప్రేక్షకుల హృదయాల్ని ఎంతో ఆర్ధ్రంతో తడిపిన ఈ సినిమా శారద కెరీర్ లో ఎప్పటికీ ప్రత్యేకమైనదే.

 

 

 

Leave a comment

error: Content is protected !!