బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు చాలా సినిమాల్లో అద్భుతమైన పాత్రలెన్నిటినో పోషించారు. అయితే ఆయన నట విశ్వరూపం ప్రదర్శించిన చిత్రం మాత్రం ‘మనిషికో చరిత్ర’. 1983లో విడుదలైన ఈ సినిమాని భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యస్.గోపాలరెడ్డి నిర్మించగా.. టి.యల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఇందులో మురళీమోహన్ , చంద్రమోహన్ లాంటి హీరోలు ప్రధానపాత్రలు పోషించినప్పటికీ… ప్రత్యేకించి ఈ చిత్ర కథాకథనాలకు హీరో గొల్లపూడి మారుతీరావేనని చెప్పుకు తీరాలి. నాలుగిళ్ళ లోగిలిలో కాపురముండే నాలుగు మధ్య తరగతి కుటుంబాల సమస్యల చుట్టూ తిరిగే కథాంశంతో రూపుదిద్దుకొన్న ఈ సినిమా మంచి విజయం సాధించింది. గణేష్ పాత్రో రాసిన సంభాషణలు గొల్లపూడి తన నోట పలుకుతుంటే.. థియేటర్స్ లో తెలుగు ప్రేక్షకులు ఏదో మంత్రం వేసినట్టు అలా చూస్తూండిపోయారంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందులో గొల్లపూడి పాత్ర పనీపాటా లేకుండా పొద్దస్తమానం వార్తా పత్రికలు తిరగేస్తూ ప్రపంచంలోని సకల వ్యవహారాలనూ పరిశీలించి చర్చిస్తూంటుంది. తన మెలిక సంభాషణలతో అందరినీ కన్ఫ్యూజ్ చేసి తనే గెలుస్తూంటాడు. అలాంటి అతడికి కన్న కూతురే సరైన బుద్ధి చెప్పి అతడు.. ఉద్యోగానికి వెళ్ళేలా చేస్తుంది. కూతురుగా పూర్ణిమ నటించింది. ఇంకా అన్నపూర్ణ, ప్రభ, హేమసుందర్, సుహాసిని, రాంజీ, జయమాలిని, రావికొండలరావు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. నిజానికి ఈ సినిమా 1982లో తమిళంలో వచ్చిన ‘కుడుంబం ఒరు కదంబం’ చిత్రానికి రీమేక్ వెర్షన్. ఇందులో గొల్లపూడి పాత్రను విసు పోషించారు. ఇక ఇదే చిత్రాన్ని కన్నడలో ఆనంద సాగర గానూ, హిందీలో ఆజ్ కా దౌర్ గానూ రీమేక్ చేయగా.. ఆయాభాషల్లోనూ సూపర్ హిట్టైంది. మొత్తానికి గొల్లపూడి నటజీవితంలో ‘మనిషికోచరిత్ర’ ఒక మరచిపోలేని చిత్రం.