సరిగమలతో సరిగంగస్నానాలు చేయడం.. నిత్యం రాగాల్లో మునిగి తేలడం.. మధురమైన గీతాలతో ముచ్చట్లు పెట్టడం.. ఇవే ఆయన వ్యాపకాలు. ఒక గీతానికి బాణీ కట్టి.. దాన్ని కమర్షియల్ గా జనరంజకం చేయడంలో ఆయన మాస్టర్. ప్రత్యేకించి మెలోడీ గీతాలు కట్టడంలో ఆయన బ్రహ్మలాంటి వాడు. పేరు మణిశర్మ. సంగీతంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయడమే ఆయనకు తెలిసిన పని. తెలుగు, తమిళ, హిందీ భాషా చిత్రాలు ఆయన సంగీతంతో తరించాయి. అద్భుతమైన పాటలెన్నో ఆయన స్వరకల్పనతో పురుడు పోసుకున్నాయి.
దాదాపుగా రెండున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న మణిశర్మ స్వర ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో మరిచిపోలేని గీతాలు. తెలుగులో సూపర్ హీరోస్, ‘అంతం’, ‘రాత్రి’ చిత్రాలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన ఆ తరువాత వెనుదిరిగి చూడలేదు. ‘ప్రేమించుకుందాం రా (కొన్ని గీతాలు), ‘బావగారూ బాగున్నారా?’, ‘గణేశ్’, ‘చూడాలని ఉంది’, ‘మనసిచ్చి చూడు’, ‘సమరసింహారెడ్డి’, ‘అనగనగా ఓ అమ్మాయి’, ‘నరసింహానాయుడు’, ‘చిరునవ్వుతో’, ‘ఖుషి’, ‘ప్రేమతో రా’, ‘భలే వాడివి బాసూ’, ‘సుబ్బు’, ‘సీమసింహం’, ‘టక్కరిదొంగ’, ‘ఆది’, ‘ఇంద్ర’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఒక్కడు’, ‘లక్ష్మీనరసింహ’, ‘ఆంజనేయం’, ‘అర్జున్’, ‘గుడుంబాశంకర్’, ‘చిరుత’, ‘పోకిరి’, ‘అతడు’, ‘ఖలేజా’… ఇలా ఎన్నో చిత్రాలున్నాయి. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన ఆయన అసలు పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. సినిమాల్లోకి వచ్చాక ఆయన పేరు మణిశర్మగా మారింది. ఈయన తండ్రి వై.ఎన్.శర్మ వయొలిన్ విధ్వాంసులు. సంగీతంలో తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఉన్నతస్థాయికి ఎదిగారు మణిశర్మ. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ కూడా సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నారు. నేడు మణిశర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ మెలోడీ బ్రహ్మకి శుభాకాంక్షలు …..