దక్షిణ భారత సినీ సంగీత చరిత్రలో మణిరత్నం ఇళయరాజా కాంబినేషన్ కు ఓ ప్రాధాన్యత ఉంది. వీళ్లిద్దరూ ఒకే రోజు పుట్టడం విశేషం … అది ఈ రోజే …
ఇళయరాజా చేసిన వెయ్యి సినిమాల సంగీతంలో మణిరత్నం చిత్రాలకు అందించిన సంగీతం కాస్త ప్రత్యేకమే. సినిమా మీద విపరీతమైన పాషన్ తో ఇండస్ట్రీకి వచ్చిన విద్యాధికుడైన యువకుడు మణిరత్నం.
ఎవరి దగ్గరా అసిస్టెంట్ గా పనిచేయలేదు. అయినా ఇళయరాజా కన్విన్స్ అయ్యాడు. దాదాపు తొమ్మిది సినిమాలు వీళ్ల కాంబినేషన్ లో రూపొందాయి. అందులో ఏడు సినిమాలు తెలుగులోకి వచ్చాయి.
హ్యూమన్ ఎమోషన్స్ ను విజువల్ గా చెప్పగలగడం మణిరత్నం స్పెషాల్టీ. తను ఎంచుకునే కథలు కూడా అందుకు అనువుగా ఉంటాయి. తనకన్నా పెద్ద వయసు అమ్మాయితో ప్రేమలో పడ్డ ఓ కుర్రాడి కథను తన తొలి చిత్రానికి తీసుకున్నాడు మణిరత్నం.
ఆ రెండు పాత్రల భావోద్వేగాలను…మానసిక ఒత్తిళ్లను తెర మీద ఆవిష్కరించగలిగాడు. పల్లవి అనుపల్లవి టైటిల్ తో వచ్చిన ఈ మూవీలో మణి టేకింగ్ కు ఇళయరాజా సంగీతం తోడైంది.
మణిరత్నం మీద యురోపియన్ దర్శకుల తో పాటు…అకిరా కురసొవా ప్రభావం బలంగా ఉంది. పాత్రలను తీర్చిదిద్దడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. మౌనరాగం చిత్రంలో మోహన్ పాత్ర మరే దర్శకుడూ ఊహించలేడు. మౌనం మూర్తీభవించిన పాత్ర…నెమ్మది, ఓపిక, ఏ విషయాన్నైనా అర్ధం చేసుకోగల మెచ్యూరిటీ, మంచితనం కలగలిసిన పాత్ర అది. అలాంటి మనిషి సాంగత్యం ఎదుటి వారిలో తెచ్చే మార్పును హృద్యంగా చెప్తాడు మణి. ఇక ఇళయరాజా ప్రాణం పెట్టి సంగీతం అందించాడా అనిపిస్తుంది.
మల్లె పూలు చల్ల గాలి మంట రేపే సందె వేళలో అంటూ వినిపించే మౌనరాగం… మరువతరమా?
మౌనరాగంలో రేవతి పాత్ర కూడా కాస్త ప్రత్యేకమైనది. ఆ పాత్ర స్వభావాన్ని చెప్పడానికి మణి చాలా స్ట్రెయిట్ గా పాటనే ఆశ్రయించాడు. ఓ పక్కన ఇంట్లో పెళ్లి చూపులు. త్వరగా ఇంటికి రావాల్సిన అమ్మాయి…వానలో పాట పాడుతూ…ఆడుతూ…పెద్ద ఖంగారు లేకుండా ఇంటికి చేరుతుంది. ఓహో మేఘమొచ్చెను..ఏదో లాలి పాడెను అంటూ సాగే ఆ పాట కంపోజింగ్ చూస్తే మణిరత్నం కోసమే చేసినట్టుంటుంది.
ఇక మౌనరాగం తర్వాత మణిరత్నం టేకప్ చేసిన ప్రాజెక్ట్ నాయకుడు. ఎపిక్ లెవెల్లో తెరకెక్కించాడు. చిన్నతనం నుంచి వ్యవస్థ చేత అన్యాయానికి గురైన ఓ వ్యక్తి ఆలోచనా విధానం…పరిణామ క్రమం ఎలా ఉంటుంది…విషయాల్ని అర్ధం చేసుకునే తీరు ఎలా ఉంటుంది..అనే కోణంలో సాగే కథనం నాయకుడు.
ఆ తర్వాత జనరేషన్ దర్శకుల్ని చాలా మందిని ప్రభావితం చేసిన సినిమా అది. రాజా సంగీతం కూడా ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గదు.
నాయకుడు తర్వాత మణిరత్నం..ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఘర్షణ. ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. పల్లవి అనుపల్లవి కి బాలూ మహేంద్ర కెమేరా దర్శకుడు. అప్పటికే ఆయన డైరక్టర్ కూడా. మణిరత్నం ఎవరి దగ్గరా పనిచేయని దర్శకుడు. ఆ తర్వాతెప్పుడూ బాలూ మహేంద్ర మణిరత్నంతో పనిచేయాలనుకోలేదు.
ఘర్షణ చిత్రం మొత్తం బ్యాక్ లైటింగ్ ఎఫెక్ట్ తో తీసి రక్తి కట్టించాడు మణిరత్నం. ఆ తర్వాత అదో ట్రెండ్ అయ్యింది. వాణీ జయరాంతో పాడించిన ఓ బృందావనం పాట అద్భుతం.
అగ్ని నక్షత్రం అనే తమిళ సినిమాను తెలుగులో ఘర్షణ గా విడుదల చేసిన సి.ఎల్.నరసారెడ్డి తో ట్యూను కుదిరి … మణిరత్నం ఒకే ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేశాడు. అదీ అప్పుడప్పుడే హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని వెతుక్కుంటున్న నాగార్జునతో. టిపికల్ మ్యూజికల్ లవ్ స్టోరీ. గీతాంజలి అనే టైటిల్ పెట్టడంలోనే మణిరత్నం పొయిటిక్ సెన్స్ కనిపిస్తుంది.
నువ్వు నేను వేరుగా లేము…నువ్వేనేను నేనే నువ్వు…నాలో నువ్వే…నీలో నేనే…ఇదే రవీంద్రుని గీతాంజలి సారం. అందుకే గీతాంజలి అద్వైత ప్రేమకావ్యం.
మరికొద్ది రోజుల్లో చనిపోతానని తెల్సిన ఓ అమ్మాయి…ఉన్న నాల్రోజులూ సరదాగా గడిపేద్దామనుకుంటుంది. ఆ క్రమంలోనే చాలా అల్లరి చేస్తుంది. ఉన్న నాలుగు నాళ్లూ నీలా నవ్వుతుంటే చాలమ్మా…అని పువ్వులను ఉద్దేశించి ఆత్రేయ రాశారో సందర్భంలో. అదే ఆ అమ్మాయి ఫిలాసపీ. వానతో మణిరత్నంకి ఏదో సెంటిమెంటల్ ఎటాచ్ మెంట్ ఉంది. ఆయన సినిమాల్లో పాటల్లోనూ ఫైట్స్ లోనూ కూడా ఉన్నట్టుండి… వర్షం అలా వచ్చేస్తుందంతే.
ఇళయరాజా, మణిరత్నం ఇద్దరూ సంవత్సరాలు తేడాగానీ… ఒకే రోజు పుట్టారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మరో మూవీ అంజలి. మానసిక సమస్యతో ఉన్న ఓ పాప చుట్టూ అల్లిన కథ. మెడికల్ గా గుడ్ మెంటల్ హెల్త్ ఉన్న వాళ్లలో ఉన్న లోపాలు చెప్తూనే…మానసిక సమస్యతో ఉన్నఅంజలి చూసే దృష్టిలోని గొప్పతనాన్ని వివరిస్తాడు. ఎన్నిలోపాలున్నా…తోటి మనిషిని అంగీకరించండి…ఆదరించండి…క్షమించండి..అక్కున చేర్చుకోండి అనే ఒక మానవత్వ ప్రబోధమే అంజలి.
ఆ తర్వాత సూపర్ స్టార్ రజనీతో మణిరత్నం సినిమా. సాంఘిక మహాభారతంలో కర్ణపర్వం. పోలీసులకు రెగ్యులర్ టార్గెట్ అయ్యే స్లమ్ కుర్రాళ్ల ఆలోచనా ధోరణి…వ్యవస్థ పట్ల వాళ్ల లో కనిపించే కసి…మధ్యతరగతి మీద వ్యక్తమయ్యే ఎవర్షను…నమ్మిన వాళ్ల కోసం ప్రాణాలైనా ఇచ్చే కమిట్మెంట్ నేపథ్యంలో సాగే సినిమా.
చిలకమ్మా చిటికెయ్యంగ…మణిరత్నం ఇళయరాజా కాంబినేషన్ లో వచ్చిన చివరి అపురూపమైన అద్భుత గీతం.
దళపతితో ఇళయరాజా మణిరత్నం బంధం వీగిపోయింది. మళ్లీ వీళ్లిద్దరూ కల్సి పనిచేస్తే బాగుణ్ణు అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉంటారు. అంతగా కదిలించిన రాగబంధం వాళ్లిద్దరిదీ … వీళ్లిద్దరినీ తలచుకున్నప్పుడు గుర్తొచ్చే పాటల్లో ముందు వరసలో నిలిచే పాట కూడా దళపతి చిత్రంలోనే వినిపిస్తుంది. దక్షిణాది సినీ సంగీత దిగ్గజాలు బాలు జేసుదాసులు కలసి పాడిన ఆ పాట అభిమానులకు పండగే.
సింగారాల పైరుల్లోనా …. బంగారాలే పండేనంటా …
మణిరత్నం కాంబినేషన్ లో ఇళయరాజా పండించిందంతా బంగారు పంటే …