హీరో మంచు మనోజ్ .. మే 20న త‌న పుట్టనరోజును పుర‌స్కరించుకొని ఒక సామాజిక కార్యక్రమాన్ని త‌ల‌పెట్టారు. కోవిడ్‌-19 వ్యాప్తి నిరోధంలో భాగంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించ‌డంతో ఎక్కడి వ‌ల‌స కార్మికులు అక్కడే ఆగిపోయారు. ఉపాధి లేక‌, స్వస్థలాల‌కు చేరుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు పంపడానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక రైళ్లలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపుతున్నారు. అయినప్పటికీ కొంత మంది వలస కార్మికులు హైదరాబాద్‌లో చిక్కుకుపోయారు. అలాంటి వారిని ఆదుకోవ‌డానికి మ‌నోజ్ ముందుకు వ‌చ్చారు.

దేశంలోని వివిధ ప్రాంతాల‌కు చెందిన ప‌లువురు వ‌ల‌స కార్మికులు హైద‌రాబాద్‌లో ఉంటూ ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం ఆయ‌న దృష్టికి రావ‌డంతో, వాళ్లను సొంత ఊళ్లకు త‌ర‌లించే బాధ్యత‌ను భుజాన వేసుకున్నారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని మూసాపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ప‌లువురిని రెండు బ‌స్సుల్లో వారి స్వస్థలాల‌కు పంపించారు. వాళ్లకు అవ‌స‌ర‌మైన ఆహారంతో పాటు మాస్క్‌లు, శానిటైజ‌ర్స్‌ను కూడా ఆయ‌న‌ అంద‌జేశారు. ఆ కార్మికులు త‌మ ఇళ్లకు చేరేంత‌ వ‌ర‌కు మార్గమ‌ధ్యంలో అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాల‌ను మ‌నోజ్ టీమ్‌ కల్పించింది. అయితే తాను 2 బస్సుల్లో పంపించిన   ఆ 56 మంది వలస కార్మికులు తమ తమ గమ్యస్థానాలకు చిరునవ్వులతో చేరుకోవడం తనకు ఆనందాన్నిస్తోందని .. .. ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా .. మరింతగా కొనసాగించేందుకు వారి  ఆశీర్వచనాలు తనకు కావాలని  ఈ రోజు తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నారు.

Leave a comment

error: Content is protected !!