తెల్లటి గ్లాస్గో పంచె, సిల్కు లాల్చి, చేతిలో గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ టిన్, చెరగని చిరునవ్వు.. ఆయన చిరునామా. తెలుగు సారస్వతాన్ని అభిమానించే సాహితీ ప్రియులకు ఆయన ఒక విశ్వవిద్యాలయం. సంప్రదాయపు వైభవాన్ని, సంస్కృతీ వికాసాన్ని, వాటిలో వున్న మాధుర్యాన్ని చవిచూడాలంటే ఆ విద్యాలయ కులపతి మల్లాది రామకృష్ణ శాస్త్రి సాహిత్యాన్ని చదువుకోవాలి.
మల్లాది పుట్టింది కృష్ణా జిల్లా చిటిగూడూరు గ్రామంలో. విద్యాభ్యాసం అంతా బందరులోనే జరిగింది. 1934లో చెన్నపట్నం చేరి ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృత, ఆంధ్ర భాషల్లో మాస్టర్ పట్టా పుచ్చుకున్నారు. వేదాలను ఆపోసన పట్టారు. నలభైకి పైగా భాషల్లో పాండిత్యం సంపాదించారు. ఇంగ్లీషు సాహిత్యం మీద మల్లాదికి మంచి పట్టు వుంది. ఇక ఆయనకు వున్న ఆస్తి కేవలం పాండిత్యమే కాదు. ఆయనకు కుస్తీ పట్టడాలు, వ్యాయామ పాఠాలు కూడా వచ్చు. కాలికి గజ్జెకట్టి నాట్యంచేసేవారు. హార్మోనియం మీద మెట్లను సుతారంగా మీటేవారు. ఇన్ని లక్షణాలున్న ఈ అక్షర యాత్రికుడు సినీ కవుల కులానికి ఆదిగురువు లాంటివారు. మల్లాది తొలి చిత్రం ‘చిన్నకోడలు’(1952). దర్శక నిర్మాత ఘంటసాల బలరామయ్య నిర్మించిన ఈ చిత్రానికి మాటలు, పాటలు సమకూర్చింది శాస్త్రినే. గోవిందరాజుల సుబ్బారావు, కుమారి, కృష్ణకుమారి, నారాయణరావు నటించిన ఈ చిత్రానికి అశ్వథామ సంగీతం సమకూర్చారు. ఇందులో అనార్కలి గేయ రూపకం ఆ రోజుల్లో బాగా పాపులర్ అయింది. సినీగేయచరిత్రలో అనార్కలిపై వెలువడిన తొలి గేయరూపకంగా దీనిని పరిగణించాలి. ఇందులో ఉరుదూ షాయరీ, పారశీక భాషా పరీమళాలను వెదజల్లారు. మల్లాది పాటలు రాసింది కేవలం 40 చిత్రాలకు మాత్రమే. వాటిలో మల్లాది రాసిన పాటలు కేవలం 185 అంటే విస్మయం కలుగుతుంది. మల్లాది రాసిన పాటలన్నీ శాశ్వత విలువలతో వెలిగే వెన్నెల దీపాలే. కేవలం పాటలే కాకుండా చిరంజీవులు, శ్రీ గౌరీ మహాత్మ్యం, రాజనందిని, రాజు-పేద, పెళ్లిచూపులు, ఉషాపరిణయం సినిమాలకు కథ, మాటలు, పాటలు సమకూర్చగా, రేచుక్క, శ్రీకృష్ణ రాయబారం, శ్రీశైల మహాత్మ్యం, వీరాంజనేయ సినిమాలకు మాటలు పాటలు రాశారు. అంజలి పిక్చర్సు వారి స్వర్ణమంజరి, సువర్ణసుందరి చిత్రాలకు మాటలు రాశారు. జాతీయాలను, లోకోక్తులను మేళవించి అలతి పొలతి పదాలతో ఆయన మాటలు రాసేవారు. నేడు మల్లాది రామకృష్ణ శాస్త్రి జయంతి. ఈ సందర్భంగా ఆ మహారచయితకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.