టాలీవుడ్ చరిత్రలో మా భూమికి చాలా ప్రాముఖ్యత ఉంది. తెలుగులో ఆర్ట్ సినిమాకు ఛాన్స్ లేదన్న వాళ్లు ఖంగారు పడేలా పారలల్ సినిమాగా విడుదలై అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న చిత్రం మా భూమి. నూన్ షోస్ గా విడుదలై సంచలన విజయం సాధించింది.

బి.నరసింగరావుది మెదక్ జిల్లా ప్రజ్నాపూర్. తండ్రి భూస్వామి. జీవితం హాయిగా గడిపేయవచ్చు. కానీ అలా జరగలేదు. చదువుకునే రోజుల్లోనే పుస్తకాలతో పరిచయం. ఊళ్లోని జానపద కళారూపాలతో సాన్నిహిత్యం దొరికాయి. నరసింగరావును విచిత్రంగా కవిత్వం…ఫొటోగ్రఫీ ఆకర్షించాయి. కాలేజ్ రోజుల్లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమ ప్రభావం నరసింగరావు మీద బలంగా పడింది. అలా ప్రజాకళా మార్గం పట్టారు నరసింగరావు.

అరవై దశకం చివర్లో జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పరోక్ష నాయకత్వం వహించిన కొండపల్లి సీతారామయ్య ప్రభావం నరసింగరావు మీద పడింది. ఆర్ట్ లవర్స్ పేరుతో ఓ సంస్ధ ఏర్పాటు చేసి దాన్ని ప్రజారాజకీయాల ప్రచారానికి వేదికగా తీర్చిదిద్దారు. గుమ్మడి విఠల్ అనే కుర్రాణ్ణి ఆకట్టుకున్నారు. దాన్నే జననాట్యమండలిగా మార్చారు. ఆర్ట్ లవర్స్ విఠలే…జననాట్యమండలి గద్దర్ గా గళమెత్తాడు.

అప్పటికి సత్యజిత్ రే, మృణాళ్ సేన్, శ్యామ్ బెనగల్, సత్యు లాంటి డైరక్టర్లు పారలల్ సినిమా తో అదరగొట్టేస్తున్నారు. తెలంగాణ నేపధ్యంలోనే శ్యామ్ బెనగల్ అంకుర్ లాంటి సినిమా తీసి నరసింగరావు లాంటి వాళ్లను విపరీతంగా ఎట్రాక్ట్ చేశాడు.
మరో వైపు తెలుగులోనూ ప్రజా సినిమా ఉద్యమం ఊపందుకుంటోన్న దశ అది. అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ది గుళ్లపల్లి రవీంద్రనాథ్ మృణాళ్ సేన్ దర్శకత్వంలో ఒక ఊరి కథ తీశాడు. నిజానికి తనూ తక్కువోడేం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ టైమ్ లో శాసించిన నవయుగ సంస్ధ అధిపతి కాట్రగడ్డ శ్రీనివాసరావు తోడల్లుడు గుళ్లపల్లి దుర్గా ప్రసాదరావు కొడుకు. అయితే నక్సల్బరీ ప్రభావంతో ప్రజాసినిమా దారి పట్టాడు.

నక్సల్బరీ రాజకీయాలు నరసింగరావునీ, రవీంద్రనాథ్ నీ ఒక్కటి చేశాయి. ఇద్దరి ఆలోచనల్లోనూ ఓ పోరాట సినిమా పురుడు పోసుకుంది. కిషన్ చందర్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నేపధ్యంలో రాసిన జబ్ ఖేత్ జాగే నవల ఆధారంగా సినిమా తీయాలనుకున్నారు. డైరక్టర్ ఎవరనే ప్రశ్న ముందుకు వచ్చింది. మృణాళ్ సేన్ అడ్వైజ్ చేసిన గౌతమ్ ఘోష్ ను పట్టుకొచ్చారు.

తెలంగాణ నుంచి తెలంగాణకు అనే కాన్సెప్ట్ తో ముందుకు సాగుతున్న కొండపల్లి సీతారామయ్య మా భూమి సినిమా ఆవశ్యకతను గుర్తించారు. నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వాన్ని ఎనభైల నాటి యువతకు తెలియచెప్పి స్ఫూర్తిని కలిగించడం ద్వారా తిరిగి తెలంగాణ లో ప్రజా రాజకీయాలకు వేదిక నిర్మించాలనుకున్నారాయన.

మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వంలోనే సాగిన నక్సల్బరీ ప్రేరణతో 1978లో జగిత్యాల జైత్రయాత్ర సాగింది. కిషన్ చందర్ జబ్ ఖేత్ జాగే నవల కూడా జైత్రయాత్ర పేరుతోనే తెలుగులోకి అనువాదమైంది. ఆ నవలకు ఇంకో అద్భుతమైన టైటిల్ పెట్టారు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి సుంకర వాసిరెడ్డి పాపులర్ నాటకం మాభూమి నే టైటిల్ గా తీసుకున్నారు.

ఒక వైపు జగిత్యాల జైత్రయాత్ర …మరో వైపు జననాట్యమండలి పాటలు రాష్ట్రంలోని యువతకు కొత్త దారిని చూపించాయి. అందుకే…మా భూమి చిత్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కథతో తెరకెక్కినా…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని సెంటర్లలోనూ దుమ్ముదులిపేసింది. అదేమిటి…దాని తర్వాత వచ్చిన బి.నరసింగరావు రంగుల కలకూ అద్భుతమైన ఓపెనింగ్స్ రావడానికి కారణం మాభూమే.

1980 సిఓసీ గా ఉన్న కొండపల్లి వర్గం పీపుల్స్ వార్ పార్టీ ని ప్రారంభించిన సంవత్సరం. మా భూమి విడుదలైన సంవత్సరం ఒక్కటే . తెలుగు కమర్షియల్ సినిమా బిగ్ స్టార్స్ ను రెండు చిన్న సినిమాలు వణికించిన కాలం.
:నరసింగరావుకు చిన్నప్పట్నించి నటన అంటే ఇష్టం. ఊళ్లో జానపద కళారూపాలను ఇంట్లో చేసి చూపించేవారాయన. అదే బాణీలో మా భూమిలో ఓ కారక్టర్ చేశారు. హీరో సాయిచంద్ ను పోరాటంలోకి పంపేందుకు జైల్లో ఉపదేశమిచ్చిన కుర్రాడి పాత్రలో అద్భుతంగా…సహజంగా నటించారు నరసింగరావు.

భూస్వామ్య వ్యవస్థ మీద పీడిత రైతాంగం చేసిన సాయుధ పోరాట చరిత్ర భారతదేశం లాంటి వ్యవసాయ ప్రధాన దేశాల్లో ఎప్పటికీ అవసరమే. భారత దేశంలోని భూమి భూస్వాముల చేతుల్లోంచి విముక్తమై…దున్నేవాడికే భూమి దక్కే వరకు మా భూమి లాంటి సినిమాల ఆవశ్యకత ఉంటుందని అప్పట్లో పుచ్చలపల్లి సుందరయ్య కామెంట్ చేశారు. మా భూమి విడుదలైన 41 సంవత్సరాల తర్వాత కూడా అంత కన్నా గొప్పగా చెప్పడానికి ఏమీ లేకపోవడం విషాదం.     

Writer  – Bharadwaja Rangavajhala

Leave a comment

error: Content is protected !!