ఆయన ఒక పాటకు బాణీకడితే.. పదహారణాల పడుచుపిల్ల ఓణీ కట్టినంత అందంగా ఉంటుంది. ఆ స్వరం పాటై వినిపిస్తే.. వినవిందుగా మహా పసందుగా ఉంటుంది. వేణుగాన వాయులీనాలు.. మృదంగ ధ్వానాలు.. హుషారు గొలిపే గిటారు రాగాలు .. తబలా తకిథిమి తాళాలు.. అబ్బో ఒకటేమిటి? ఆయన ఒక పాటను అలంకరించడానికి.. మనుసు ను ఆహ్లాదపరిచే ఎన్నో సంగీత వాయిద్యాలను తోడు తెచ్చుకుంటాడు. ఆయన పేరు యం.యం.కీరవాణి. తమిళంలో మరకతమణి , హిందీలో యం.యం.క్రీమ్. ఆయన అసలు పేరు కోడూరి మరకతమణి. ఆయన తండ్రి శివశక్తి దత్తాకి కీరవాణి రాగం అంటే మహా ఇష్టం కాబట్టి.. ఆ రాగం మరకతమణిని ధరించిందన్నమాట.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో జన్మించారు కీరవాణి. 1990లో ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘మనసు మమత’ చిత్రంతో సంగీత దర్శకుడయ్యారాయన. 1987లో ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి దగ్గర సహాయకుడిగా ప్రస్థానం ప్రారంభించిన కీరవాణి ‘కలెక్టర్‌గారి అబ్బాయి’, ‘భారతంలో అర్జునుడు’ తదితర చిత్రాలకి పనిచేశారు. తొలి ప్రయత్నంగా ‘కల్కి’ అనే చిత్రానికి స్వరాలు సమకూర్చారు. అయితే ఆ చిత్రం విడుదల కాలేదు. దాంతో సాంకేతికంగా ‘మనసు మమత’నే ఆయనకి తొలి చిత్రమైంది. 1991లో విడుదలైన ‘క్షణ క్షణం’తో కీరవాణి సంగీతం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కథ ఎలాంటిదైనా దానికి తన సంగీతంతో కొత్త కళని తీసుకురావడంలో దిట్ట కీరవాణి. ‘అన్నమయ్య’ చిత్రానికిగానూ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొన్నారాయన. ‘రాజేశ్వరి కళ్యాణం’, ‘అల్లరి ప్రియుడు’, ‘పెళ్ళి సందడి’, ‘ఒకటో నెంబర్ కుర్రాడు’, ‘ఛత్రపతి’, ‘వెంగమాంబ’, ‘ఈగ’, ‘బాహుబలి’ చిత్రాలకి ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాల్ని సొంతం చేసుకొన్నారు. ‘స్టూడెంట్ నెంబర్ 1’, ‘మర్యాద రామన్న’, ‘బాహుబలి’ చిత్రాలకి ఉత్తమ నేపథ్య గాయకుడిగా పురస్కారాన్ని అందుకొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాగిరెడ్డి – చక్రపాణి జాతీయ పురస్కారాన్ని కూడా అందుకున్నారాయన. ఎనిమిది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలతో పాటు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం కూడా అందుకొన్న ఘనకీర్తి ఆయనది. నేడు కీరవాణి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ సుస్వరవాణికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే కీరవాణి…