ఆకర్షించే ముఖం.. ఆకట్టుకునే కళ్ళు.. పెదవులపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు.  అద్భుతమైన అభినయం, అందుకు తగ్గ ఆంగికం.. వీటికి తోడు వినయ విధేయతలు ఆయన వ్యక్తిత్వానికి వన్నె తెస్తాయి. ఆయన పేరు యం.బాలయ్య. చక్కటి నటుడు, తెలివైన నిర్మాత.  ఎత్తుకు పై ఎత్తు’ చిత్రంతో బాలయ్య హీరోగా పరిచయమయి విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. అమృతా ఫిలింస్‌ సంస్థని నెలకొల్పి అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావులను నిర్మాతలుగా చేసి చక్కని చిత్రాలు అందించారు. మంచి పర్సనాలిటీ, నటనా ప్రతిభ కలిగి ఉండటం వలన సాంఘిక చిత్రాల్లోనే కాక పౌరాణిక చిత్రాల్లో కూడా రాణించారు. సినిమాలలోకి రాకముందు రంగస్థల నటుడుగా వ్యవహరించారు. తను నిర్మించే చిత్రాలకు కథను కూడా తనే సమకూర్చేవారు ఇంజనీరింగ్‌ కోర్సు చేసిన బాలయ్య.

నిర్మాతగా 1981లో విశ్వనాథ్‌ దర్శకత్వంలో ‘చెల్లెలి కాపురం’ చిత్రాన్ని, కృష్ణ హీరోగా ‘నేరము శిక్ష’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని తమిళ హిందీ భాషల్లోనూ నిర్మించారు. చుట్టాలున్నారు జాగ్రత్త, కిరాయి అల్లుడు, అన్నదమ్ముల కథ, ప్రేమ-పగ, పసుపుతాడు, ఈనాటి బంధం ఏనాటిదో చిత్రాలకు నిర్మాతగా, ఊరికిచ్చిన మాటతో దర్శకుడుగా మారి కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. చెల్లెలి కాపురం, ఊరికిచ్చిన మాటకు నంది అవార్డులు లభించాయి.

కుంకుమరేఖ, చివరకు మిగిలేది, మోహినీ రుక్మాంగద, మొనగాళ్ళకు మొనగాడు, పార్వతీ కళ్యాణం తదితర చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాలకు కూడా సరిపోయే పెర్సనాల్టిd బాలయ్యకు అదనపు అర్హత అయింది. సిగరెట్‌ పొగతో ముందు రాగా తర్వాత బాలయ్య ఎంట్రన్స్‌తో అతడే సి.ఐ.డి. ఆఫీసర్‌ అనే భ్రమ కల్పించిన సిసలైన విలన్‌గా పేరు తెచ్చుకున్నారు ‘మొనగాళ్ళకు మొనగాడు’ చిత్రంలో. పాండురంగడు, తప్పుచేసి పప్పుకూడు, పెళ్లిసందడి, అన్నమయ్య తదితర చిత్రాల్లో నటించిన బాలయ్య  పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!