కర్నాటక సంగీతాన్ని తెలుగునాట ప్రాచుర్యంలోకి తెచ్చిన మహా సంగీత విద్వాంసుల్లో ఆయన ఒకరు. స్వప్త స్వరాల్ని  శ్వాసించి.. సరిగమల సారాన్ని శాసించి.. ఎన్నో రాగాల్ని స్వయంగా కనిపెట్టి.. సంగీత ప్రియులకు పంచిన సలలిత రాగసుధారససారం ఆయన. పేరు మంగళంపల్లి బారమురళీ కృష్ణ. మౌనమె నీ భాష ఓ మూగమనసా… అని శ్రావ్యంగా ఆలపించడం.. పాడనా వాణి కళ్యాణిగా.. అంటూ కళ్యాణి రాగంలో లలితంగా పాడడం ఆయనకే చెల్లింది.

తన ఎనిమిదేళ్ల వయసులోనే పూర్తిస్థాయి కచేరి నిర్వహించి అందరినీ అబ్బురపరచారు మంగళంపల్లి. పదకొండవ ఏటనే ఆకాశవాణిలో తొలిసారి గళం విప్పారు. కుర్తాళం పీఠాధిపతి విమలానంద భారతి ప్రేరణ, ఆశీర్వాద బలంతో తన పదిహేనవ ఏటకే 72 మేళకర్త రాగాలను మధించి, పండిత అప్పయ్య శాస్త్రి శిక్షణలో కృతి, కీర్తన వంటి రాగ రచనా రహస్యాలను గ్రహించి, 1952లో జనక రాగ కృతి మంజరి అనే కీర్తనా సంపుటిని ప్రచురించారు. సంగీత సామ్రాజ్యంలో బాలమురళీకృష్ణ సాధించని కొలువులు లేనేలేవు. స్వయంగా కొన్ని కొత్త రాగాలకు రూపకల్పన చేసి సంగీత బ్రహ్మగా ఖ్యాతి గడించారు. వాటిలో మహతి, లవంగి, తరణి, ప్రతిమధ్యమావతి, రోహిణి, కాళిదాస, మనోరమ, సర్వశ్రీ, సిద్ధి, గణపతి వంటివి కొన్ని మాత్రమే. అమ్మప్రేమకు దూరమైన బాలమురళి సూర్యకాంతి పేరుతో ఒక కొత్తరాగాన్ని సృష్టించి తల్లికి నీరాజనం పలికారు. వాడుకలో లేని సునాద వినోదిని వంటి కొన్ని రాగాలకు పునరుజ్జీవనం కలిపించారు. అమెరికా, కెనడా, బ్రిటన్, రష్యా, ఇటలీ, సింగపూరు, శ్రీలంక, మలేషియా వంటి విదేశాలలో కచేరీలు చేయడం మొదలెట్టి దాదాపు పాతిక వేల కచేరీల రికార్డులను సృష్టించారు. ఎన్నో సత్కారాలను, సన్మానాలను అందుకున్నారు. సంగీత కళానిధి, గాన కళాభూషణ, జ్ఞాన శిఖామణి, జ్ఞాన సరస్వతి, గాన కౌస్తుభ, నాద మహర్షి, గాంధర్వ గానసామ్రాట్‌ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలనెన్నిటినో అందుకున్నారు. కర్నాటక సంగీతానికి ఆత్మబంధువై నిలిచారు. బాలమురళి సినిమాల కోసం ఆలపించిన పాటల్లో ‘ఏటిలోని కెరటాలు యేరు విడచివోవు’ (ఉయ్యాల జంపాల), ‘పలుకే బంగారమాయెనా అందాలరామా’ (అందాలరాముడు), ‘మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా’, (శ్రీరామాంజనేయ యుద్ధం), ‘మౌనమే నీ భాష ఓ మూగమనసా’ (గుప్పెడు మనసు), ‘పాడనా వాణి కల్యాణిగా’ (మేఘసందేశం), ‘తెరతీయరా తిరుపతి దేవరా’ (శ్రీవేంకటేశ్వర వైభవం) బాగా పాపులర్‌ అయినవిగా చెప్పవచ్చు. ఎన్టీఆర్‌ నిర్మించిన ‘శ్రీమద్విరాట పర్వము’ సినిమాలో బాలమురళి చేత బృహన్నల పాత్రకు ‘ఆడవే హంస గమనా’, ‘జీవితమే కృష్ణ సంగీతమూ’ పాటల్ని పట్టుబట్టి పాడించారు. స్వాతి తిరుణాల్‌ అనే మళయాళ సినిమాలో పాడిన భజన గీతానికి ఉత్తమ గాయకుడిగా బాలమురళి అవార్డు అందుకున్నారు. నేడు బాలమురళీకృష్ణ  జయంతి .ఈ సందర్భంగా ఆ నాదమహర్షికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

Leave a comment

error: Content is protected !!