ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో హీరోగానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ నటించిన ఆయన కి రాజమండ్రితో లింకేంటి? అన్న సందేహం రావచ్చు. అయితే ఒకేఒక సినిమాతో రిషీజీ మన గోదావరి తీరంతో మంచి అనుబంధం ఏర్పరుచుకున్నారు. అదే సర్గం సినిమా. తెలుగు ‘సిరిసిరిమువ్వ’ చిత్రానికి అది రీమేక్ వెర్షన్. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలోనే ఆ సినిమా తెరకెక్కింది. అందులో మూగ నాట్యకళాకారణిగా నటించిన జయప్రదకి అదే మొదటి హిందీ సినిమా. ఈ సినిమాను రాజమండ్రిలో ‘సిరిసిరిమువ్వ’ చిత్రం తీసిన లొకేషన్స్ లోనే తీయడం విశేషం. ఆ సందర్భంగానే రిషీకపూర్ రాజమండ్రి గోదావరి తీరాన మొదటిసారిగా కాలుమోపారు. ఒక్కో షెడ్యూల్‌లో 20 రోజుల చొప్పున, రెండు షెడ్యూళ్లలో, మొత్తం 40 రోజుల్లో ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది సర్గం చిత్రం . రిషికపూర్ రాజమండ్రిలోని నాటి ప్రసిద్ధ హోటల్ అప్సరాలో బస చేశారు. తెలుగులో సిరిసిరిమువ్వలాగే, హిందీలో సర్‌గమ్ కూడా ఘన విజయం సాధించడం, తెలుగు సినిమా చిత్రీకరణ జరుపుకున్న లొకేషన్లలోనే హిందీ సినిమా షూటింగ్ జరుపుకోవడం విశేషం.
‘‘ఆయన ఎంతో ఆత్మీయంగా మెలిగే వారు. ఈ చిత్రంలో రాజమండ్రికే చెందిన జయప్రద హీరోయిన్. సర్గమ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో, నేను రాజమండ్రి అప్సరా హోటల్‌లో హీరో రిషీకపూర్, నిర్మాత ఎన్.ఎన్.సిప్పీలను కలుసుకున్నాను. గోదావరి అందచందాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని రిషీకపూర్ అన్నారు. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు. – శ్రీపాద జిత్‌మోహన్ మిత్రా, నటుడు, గాయకుడు.