ఇప్పటి వరకు చేసిన సినిమాలతో పోలిస్తే.. ఈ చిత్రం చాలా డిఫరెంట్ మూవీ అంటోంది హీరోయిన్ ఎస్తర్. ఎంఆర్ చౌదరి వడ్లపట్ల సమర్పణలో.. చంటి గాణమని దర్శకత్వంలో ఫ్రెష్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకటేష్ చిక్కాల నిర్మిస్తున్న మూవీ లేతాకులు. ఈ చిత్రంలో ఎస్తర్‌తో పాటు శృతిశరణ్, అవయుక్త, వంశీ పాండ్య మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగింది. మోహన వడ్లపట్ల తమ్ముడు సత్యం స్క్రిప్ట్ కెమెరా స్విచ్చాన్ చేయగా.. మోహన వడ్లపట్ల కెమెరా స్విచ్చాన్ చేసారు. తొలిషాట్‌కు వి.ఆర్ సముద్ర గౌరవ దర్శకత్వం చేసారు.
లేతాకులు చిత్రం కొత్త కథ, సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తుందన్నారు ఎంఆర్ చౌదరి వడ్లపట్ల. ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా చక్కని కథ కథనాలతో దర్శకులు చంటి గాణమని తెరకెక్కిస్తున్నారన్నారు ఎంఆర్ చౌదరి.
దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమౌతుందనీ… ఎస్తర్ ఈ చిత్రంలో కీరోల్ ప్లే చేస్తోందనీ.. స్వతహాగా దర్శకత్వ శాఖలో అనుభవం ఉన్నా.. చంటి గాణమని చెప్పిన కథ నచ్చి నిర్మించడానికి ముందుకొచ్చానన్నారు నిర్మాత వెంకటేష్ చిక్కాల. తమ ప్రయత్నంలో భాగమవడానికి ఎంఆర్ చౌదరి వడ్లపట్ల ముందుకొచ్చనందుకు కృతజ్ఞతలు తెలియజేసారు నిర్మాత.
తప్పు చేసినవాడికి ఏదో శిక్ష విధించడం కాదు.. అదే బాధ వాళ్లకు కలిగేలా చేయడమే అసలైన శిక్ష అని తెలియజేసే కథ ఇదన్నారు దర్శకులు చంటి గాణమని. ఈ కథ అందరికీ నచ్చుతుందన్నారు. నూతిలో కప్పలు తర్వాత చేస్తున్న ఈ సినిమాను చెయ్యడానికి నిర్మాత సమర్పకులు ముందుకొచ్చారన్నారు. మిగతా అన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.