నటీనటులు: రజినీకాంత్ విష్ణు విశాల్ విక్రాంత్ అనంతిక సనిల్ కుమార్ సెంథిల్ జీవిత తంబి రామయ్యనిరోషా తదితరులు

సంగీతం: ఏఆర్ రెహమాన్

రచన ఛాయాగ్రహణం: విష్ణు రంగస్వామి

నిర్మాత: సుభాస్కరన్

దర్శకత్వం: ఐశ్వర్య రజినీకాంత్

రజినీకాంత్ ఏడుపదుల వయసులో కూడా జైలర్‌ మూవీతో బంపర్‌హిట్ కొట్టాడు. సూపర్‌స్టార్‌స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. అదే జోష్‌తో హీరోగా కాకున్నా.. తన కుమార్తె ఐశ్వర్యరజినీకాంత్ డైరెక్షన్‌లో గెస్ట్‌ రోల్ చేసిన మూవీ లాల్‌సలాం. ఈ సినిమా రజినీ ఫ్యాన్స్‌ని , తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా ఈ రివ్యూలో చూద్దాం.

కథ : అరుణ్‌ (విష్ణు విశాల్‌) షంషుద్దీన్‌ ( విక్రాంత్‌) ఇద్దరూ మంచి ఫ్రెండ్స్‌. వీరికి క్రికెట్‌ లో నేషనల్స్ ఆడాలనే కోరిక ఉంటుంది. ఊరిలో హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఉంటుంటారు. ఓ సంఘటన కారణంగా హిందూ ముస్లిం గొడవలు తలెత్తుతాయి. అరుణ్‌ , షంషుద్దీన్‌ కూడా గొడవ పడతారు. ఆ క్రమంలో అరుణ్‌ షంషుద్దీన్ చేయి నరుకుతాడు. క్రికెటర్‌గా ఎదగాలన్న షంషుద్దీన్‌ కోరిక సమాధి చేసినట్టవుతుంది. షంషుద్దీన్‌ తండ్రి మొయిద్దీన్‌ (రజినీకాంత్ ) అరుణ్‌ పై కక్ష పెంచుకుంటాడు. వీరి గొడవ ఏమైంది.. హిందూ ముస్లిం ఘర్షణ ఎలా తగ్గింది.. చివరికి అరుణ్ క్రికెటర్‌గా ఎదిగాడా అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ : మతపరమైన గొడవల బ్యాక్‌డ్రాప్ లో గతంలో చాలా సినిమాలొచ్చాయి. పల్లెటూళ్లలో హిందూ ముస్లింలు ఎలా కలిసిమెలిసి ఉంటారో.. గొడవలు తలెత్తితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ సినిమాలో చూపించారు. అయితే ఎక్కడా ఆసక్తికరంగా సాగదు. పూర్తిగా తమిళవాసన కొట్టే సీన్లు డైలాగులు. రజినీకాంత్ పాత్ర ఎంటరయినపుడు ఆసక్తి పెరుగుతుంది. అయితే రజినీ మార్క్ ఎలివేషన్స్‌ , హీరోయిజం ఈసినిమా లో కనిపించదు. ఓ ముస్లిం పెద్దగా.. మంచి మాటలు చెప్పే వ్యక్తిగా చూపించారు. అయితే రజినీ ఉన్నంతసేపు ఆకట్టుకుంటాడు. మిగతా కథంతా చాలా బోరింగ్ గా సాగుతుంది. కొన్ని చోట్ల ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. ఓవరాల్‌గా లాల్‌సలాం ఆసక్తిలేని కథనంతో సాగుతుంది.

నటీనటులు : రజినీకాంత్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. పెద్దవాడిగా హుందాగా రజినీ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. కెరీర్‌లో ఫస్ట్‌టైమ్‌ హీరోయిజం లేని రజినీని తెరమీద చూడటం లాల్‌సలాంలోనే కనిపిస్తుంది. విష్ణు విశాల్‌ స్వతహాగా క్రికెటర్‌ కావడం వలన ఊళ్లో ఆవారాగా తిరుగుతూ క్రికెట్ ఆడే పాత్రను ఆడుకున్నాడు. విక్రాంత్ కూడా బాగా చేసాడు. హీరోయిన్ పాత్రలకు అంతగా స్కోప్‌ ఇవ్వలేదు. నిరోశా, జీవితలు పరిధి మేరకు బాగానే నటించారు.

టెక్నిషియన్స్‌ : ఈ సినిమా కథ అందించింది, సినిమాటోగ్రఫీ చేసింది విష్ణు రంగస్వామి. కథ పరంగా చాలా లేయర్స్‌ ఉంది. కథగా చదివితే ఆసక్తిగా అనిపిస్తుంది కానీ.. తెరపై ప్రజెంట్ చేయడంలో దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్‌ ఫెయిలయినట్టే. ఎన్నో లేయర్స్ ఉన్న ఈ కథను డీల్‌ చేయడంలో తడబడింది. ఏ లేయర్‌ను సరైన పద్దతిలో ముగించలేక కిచిడీ చేసినట్టుగా కనిపిస్తుంది. సంగీతం అందించింది ఏఆర్‌ రెహమాన్‌.. ఏ మాత్రం రెహమాన్‌ మార్క్‌ కనిపించదీ సినిమాలో. విజువల్స్ బాగున్నాయి.

బోటమ్‌ లైన్‌ : సలామ్‌ కొట్టించలేకపోయిన లాల్‌సలాం

రేటింగ్ : 2.5 / 5

Leave a comment

error: Content is protected !!