నందమూరి బాలకృష్ణ కెరీర్ లో హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాల్లో ‘లక్ష్మీ నరసింహ’ ఒకటి. 2004, జనవరి14న విడుదలైన ఈ సినిమా బాలయ్యకు మంచి పేరుతెచ్చిపెట్టింది. అసిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కె.విశ్వనాథ్, సునీల్ , కృష్ణ భగవాన్, మురళీ మోహన్, ఆహుతి ప్రసాద్ తదితరులు నటించారు. జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాను నిర్మించాడు. నిజాయితీ కలిగిన ఒక పోలీసాఫీసర్ అవినీతికి పాల్పడితే.. అందులో కూడా నిజాయితీ ఉంటుందని చాటి చెప్పిన చిత్రం ఇది. మామూలు పాత్రలు పోషిస్తేనే పవర్ ఫుల్ డైలాగ్స్ తో విరుచుకుపడే బాలయ్య.. ఇక పోలీస్ యూనిఫామ్ తొడిగితే ఆగుతాడా? మరింత స్థాయిలో విజృంభిస్తాడు. పరుచూరి బ్రదర్స్ పదునైన సంభాషణల్ని బాలయ్య నోట పవర్ ఫుల్ గా వినిపించిన ఈ సినిమా .. నిజానికి విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘సామి’ చిత్రానికి రీమేక్ వెర్షన్ . తమిళ నాట సూపర్ హిట్టు అయిన ఈ సినిమా విక్రమ్ కెరీర్ కు గట్టి పునాది వేసిన చిత్రాల్లో ఒకటి గా నిలిచింది . ఈ సినిమాతోనే కోట శ్రీనివాసరావు తమిళ చిత్ర పరిశ్రమకు నటుడిగా పరిచయం అయ్యారు. ఇక ఇదే సినిమా ఆ తర్వాత బెంగాలీలో బరూద్ (మిథున్ చక్రవర్తి హీరో) గానూ, కన్నడలో అయ్యగానూ (దర్శన్ హీరో ), బాలీవుడ్ లో పోలీస్ గిరి గానూ(సంజయ్ దత్ హీరో ) రీమేక్ అయి ఆయాభాషల్లో కూడా సూపర్ హిట్టు అయింది.