దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ తెరకెక్కించారు. శోభిత కథానాయిక. ఇంద్రజిత్ సుకుమారన్, సన్నీ వేస్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో నవంబర్ 12న విడుదల కానుంది. ఈ సంధర్భంగా హైదరాబాద్ లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ పాల్గొంది. ఈ కార్యక్రమంలో…
డీఓపీ నిమిష్ రవి మాట్లాడుతూ.. ‘నేను ఎక్కువగా మాట్లాడను. ఇలా ఇంత మంది ముందుకు వచ్చి ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. టీజర్, ట్రైలర్ చూసి అందరూ బాగుందన్నారు. దేశంలోని చాలా ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని షూట్ చేశాం. ఈ సినిమాను అందరూ కూడా థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.
మాటల, కథ రచయిత విన్ని విశ్వ మాట్లాడుతూ.. ‘నాకు రాయడం మాత్రమే తెలుసు. మాట్లాడటం రాదు. నాకు దుల్కర్ సోదరుడిలాంటి వారు. మాది పదేళ్ల స్నేహం. నేను ఏ కథ రాసినా కూడా దుల్కర్‌కు చెబుతాను. ఈ చిత్రం పాన్ ఇండియన్ లెవెల్‌లో విడుదలవుతోంది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా విడుదలైన తరువాత నేను మాట్లాడతాను. నాకంటే ఎక్కువగా.. సినిమా మాట్లాడాలి’ అని అన్నారు.
హీరో భరత్ మాట్లాడుతూ.. ‘నేను ఈ చిత్రం కోసం నాలుగైదు రోజులే పని చేశాను. కానీ ఆ జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దుల్కర్ ఎంత కష్టపడ్డారో నేను చూశాను. ఇలాంటి సినిమాను తీయడం అంత సులభం ఏమీ కాదు. ఇది కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. నవంబర్ 12న రాబోతోంది. డేట్ రాసి పెట్టుకోండి. ఈచిత్రం కచ్చితంగా హిట్ అవుతుంది.’ అని అన్నారు.
నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. దుల్కర్, ఆయన తండ్రికి నేను వీరాభిమానిని. మీరు ఏపీలో అమ్మాయిలందరి మనసులను గెలిచేశారు. మహానటి, ఓకే బంగారం, కనులు కనులు దోచాయంటే ఇలా అన్ని సినిమాలు అందరినీ మెప్పించాయి. సినిమాలకు ఆయనే డబ్బింగ్ చెబుతారు. భాష అంటే ఆయనకున్న గౌరవం అదే. ఈ చిత్రాన్ని నేను చూశాను. ఇదో పీరియడ్ చిత్రం. బాహబలి, కేజీయఫ్‌లాంటి సినిమాల సరసన కురుప్ చేరుతుంది. ఈ చిత్రం సక్సెస్ అవుతుంది. ఈ చిత్రంలోని టెక్నికల్ విలువల గురించి చాలా రోజులు చెప్పుకుంటారు. ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేయాలి’ అని కోరుకున్నారు.
సంజయ్ మాట్లాడుతూ.. ‘నేను ఎక్కువగా సినిమాలకు రాను. కానీ ఫని, రోహిత్ నాకు ఫ్యామిలీ వంటి వారు. సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని వారు చెప్పినప్పుడు కోపడ్డాను. ఫస్ట్ ట్రైలర్ చూపించండి అని అన్నాను. 20 సెకన్లలోనే నాకు ఈ సినిమా ఏంటో అర్థమైంది. మొదటి ప్రాజెక్ట్‌గా ఇలాంటి సినిమాను ఎంచుకోవడం మంచి పరిణామం. సూపర్ స్టార్ కొడుకు అయి ఉండి ఆ షాడో నుంచి బయటకు వచ్చి తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసుకోడం సులభం కాదు’ అని అన్నారు.
నిర్మాత రోహిత్ మాట్లాడుతూ.. ‘మాకు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. నవంబర్ 12న సినిమా రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.
శోభిత ధూళిపాళ్ల మాట్లాడుతూ.. ‘సినిమా రెండేళ్ల క్రితం పూర్తయింది. ఓటీటీలో రిలీజ్ చేస్తారేమో అని భయపడ్డాం. కానీ ఇప్పుడు ఇలా ఇన్ని భాషల్లో ఇంత పెద్ద ఎత్తున విడుదల చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం’ అని అన్నారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా నాకు ఎంతో స్పెషల్. టీజర్, ట్రైలర్‌లో మీరు చూసింది కేవలం ఒక్క శాతమే. సినిమా చూసే వాళ్లు కచ్చితంగా అద్బుతమైన అనుభూతికి లోనవుతారు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్, ఐడియా అందుకే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో విడుదల చేస్తున్నాం. అన్ని భాషల ప్రేక్షకుల కంటే తెలుగు ఆడియెన్స్ సినిమాలను ఎక్కువగా ప్రేమిస్తుంటారు. నేను త్వరలోనే తెలుగు సినిమా చేస్తాను. హను రాఘవపూడి, వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో చేస్తున్నాను. పూర్తి తెలుగు చిత్రంగా ఉండాలని నేనే డబ్బింగ్ చెప్పాను. మీరు సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. మీ ఫీడ్ బ్యాక్ వినేందుకు నేను ఎదురుచూస్తున్నాను. నవంబర్ 12న థియేటర్లో కలుద్దామ’ని అన్నారు.