సినిమా ఆయన పేషన్ . సినిమాయే ఆయనకు సర్వస్వం. ఒక మంచి ఐడియాను సినిమాగా మలచడంలో ఆయన ప్రతిభ అసాధారణం. అలాగే.. తనకు కావాల్సిన రీతిలో.. నటీనటుల నుంచి ఔట్ పుట్ రాబట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. భారీ కేస్టింగ్ తో కుటుంబ కథాచిత్రాల తీయడంలోనూ ఆయన టాలెంట్ సాధరణమైనది కాదు. ఫ్యామిలీ రిలేషన్స్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ ఆయన స్టైల్. పేరు కృష్ణవంశీ. క్రియేటివ్ డైరెక్టర్ గా కొనియాడబడుతోన్న ఆయన సినిమాలు.. కొత్తగా వచ్చే దర్శకులకు పాఠాలు. సినిమా మీద ఎంతో మక్కువ కలిగిన టెక్నీషియన్స్ కు మార్గదర్శకాలు.
కృష్ణవంశీది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం. చిన్నప్పటి నుంచి ఆయనకు సినిమాల మీద విపరీతమైన మమకారం.. చెప్పలేనంత అవగాహన. ఆ పేషన్ తోనే ఆయన దర్శకుడు అవ్వాలనే కోరికతో హైద్రాబాద్ పయనమయ్యారు. కొన్నాళ్ళపాటు త్రిపురనేని వరప్రసాద్ అనే దర్శకుడి దగ్గర సహాయకుడిగా ఉన్నారు. వర్మ వద్ద చేరిన తరువాత కొన్నాళ్ళకు అనగనగా ఒక రోజు చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లభించినా బడ్జెట్ పరిధి దాటిపోతుండడంతో అతడిని ఆ బాధ్యత నుండి తప్పించడం జరిగింది. కానీ ఆయన ప్రతిభను గమనించిన వర్మ తన సొంత బ్యానర్లోనే గులాబి అనే చిత్రంతో మరో అవకాశం ఇచ్చారు. వర్మ శిష్యులు వర్మ పద్ధతిలోనే చిత్రాలు తీస్తారన్న అపప్రధను చెరిపేసినవాడు కృష్ణవంశీ. ఆయన సినీ కెరీర్ లో నిన్నేపెళ్లాడుతా, మురారి, అంత:పురం, సముద్రం, ఖడ్గం, చందమామ లాంటి చిత్రాలు టాలీవుడ్ లో మంచి విజయం సాధించాయి . ప్రస్తుతం రంగమార్తాండ అనే డిఫరెంట్ మూవీని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈసినిమా మరాఠీ మూవీ నటసామ్రాట్ కి రీమేక్ వెర్షన్. నేడు కృష్ణవంశీ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.