కాదేదీ కవితకనర్హం అన్నట్టు ప్యాషన్ ఉంటే ఏ రంగవారికైనా సినిమా రంగం ఆహ్వానం పలుకుతుంది. అలా సాఫ్ట్‌వేర్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి ప్యాషన్ ఉన్న నిర్మాతగా అడుగుపెడుతున్నారు పెట్లా రఘురామ్ మూర్తి. రిష్వీ తిమ్మరాజు , విస్మయశ్రీ జంటగా కృష్ణగాడు ఓ రేంజ్ అనే సినిమాతో నిర్మాతగా డెబ్యూ ఇస్తున్నారు పెట్లా రఘురామ్ మూర్తి. ఈసందర్భంగా నిర్మాత పాత్రికేయులతో సినిమా విశేషాలపై ముచ్చటించారు.
చేసేది సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కానీ ఆలోచనలు మాత్రం సినిమాలవైపు తిరిగేవి. తనకు పరిచయం ఉన్న ఓ ఘోస్ట్ రైటర్ ద్వారా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత ఉండటంతో సినిమా తీద్దామనుకున్న నిర్ణయానికి వచ్చేసారు. కుటుంబ సమేతంగా కలిసి చూడదగ్గ సినిమా తీయాలనేది ఇద్దరి ఆలోచన. అందుకు రూపంగా ఇప్పుడు కృష్ణగాడు ఓ రేంజ్ అనే సినిమా.. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో కాదు.. ఈ సినిమా డైరెక్టర్ రాజేష్ దొండపాటి అన్నారు నిర్మాత పెట్లా రఘురామ్ మూర్తి.
మొదటి ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా అన్న టెన్షన్, భయం అందరికీ ఉంటాయి. కానీ సక్సెస్ వచ్చినా రాకున్నా నిర్మాతగా కంటిన్యూ అవుతానంటున్నారు పెట్లా రఘురామ్ మూర్తి. లాభాలు రాకున్నా వరుసగా సినిమాలు తీస్తూనే ఉంటానన్నారు. డాక్టర్ రామానాయుడు, దిల్‌రాజు, అల్లు అరవింద్ వంటి నిర్మాతలే నాకు ఇన్‌స్పిరేషన్ అంటున్నారు రఘురామ్ మూర్తి.
కృష్ణ గాడు ఓ రేంజ్ సినిమా నిర్మాణంలో విడుదల సమయంలో దిల్‌రాజు, బెక్కెం వేణుగోపాల్ గారు చేసారన్నారు నిర్మాత. శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత, పెట్లా రఘురామ్ మూర్తి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రాజేష్ దొండపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 4న రిలీజ్ అవుతోంది.