ఆయనలో వెటకారం టన్నుల లెక్కనుంది. నోరు విప్పితే పంచ్ డైలాగ్.. మాటమాటకీ చమత్కారం.. మాటి మాటికీ వేళాకోళం.. అసలు ఆయన డైలాగ్ పలికితేనే .. ఎవరిమీదో సెటైర్ వేసినట్టుంటుంది. ఆయన పేరు కృష్ణభగవాన్. అసలు పేరు మీనపల్లి పాపారావు చౌదరి. మనిషి చూడ్డానికి విలన్ లా కనిపించినా.. ఆయన ఒక హాస్య చతురుడు. నాటకాలనుంచి రావడం వల్లనో ఏమోగానీ.. తను నటించిన సినిమాల్లో తన పంచ్ డైలాగ్స్ ను తానే రాసుకొని పలకడం ఆయన స్టైల్ .
తూర్పుగోదావరిజిల్లా కైకవోలు కృష్ణభగవాన్ స్వస్థలం. ప్రాథమిక విద్యాభ్యాసము అక్కడే పూర్తిచేయగా.. కాకినాడలో ఇంటర్, హైదరాబాదులో బాగ్ లింగంపల్లి లోని అంబేద్కర్ కళాశాల నుండి బీకాం కంప్లీట్ చేశాడు. అటుపై చదవాలనే ఆశ ఉన్నా కానీ.. నటనపై ఆసక్తి పెంచుకొన్నాడు. నటనావకాశాల కోసం మద్రాసు చేరుకొన్నాడు. అక్కడ మిత్రబృందంతో కలిసి అప్పటి నటి అనూరాధ ఇంట్లోని మేడమీది గదిలో అద్దెకు ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నించేవాడు. ఇంటిదగ్గరినుండి నెల నెలా డబ్బులు పంపిస్తుండటంతో బ్రతుకుతెరువు కోసం వేరే వృత్తిని చేసే పని తప్పింది. మహర్షి చిత్రం తీసే ప్రయత్నాల్లో ఉన్న వంశీ దృష్టిలో పడడంతో …అందులో హీరోతో సమానమైన పాత్రనిచ్చి పాపారావు చౌదరి అనే పేరును కృష్ణభగవాన్ గా మార్చారు వంశీ. ఆ సినిమాకి మంచి పేరు రావడంతో.. ఆ తర్వాత ఏప్రిల్ 1 విడుదల చిత్రంలో మెయిన్ విలన్ పాత్రనిచ్చి..మరింత ప్రోత్సహించారు వంశీ. ఆపై ప్రేమ అండ్ కో లాంటి చిత్రాల్లోనూ కృష్ణభగవాన్ కు మంచి హాస్యపాత్రలిచ్చారు వంశీ. అయితే ఆపై కాస్తంత గ్యాప్ ఇచ్చిన కృష్ణభగవాన్ ను తిరిగి ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రంతో స్ర్కీన్ మీదకు తీసుకొచ్చారు వంశీ . అందులోని పాత్ర బాగా పేలడంతో .. అక్కడనుంచి కృష్ణభగవాన్ వెనుతిరిగి చూడలేదు. లెక్కకు మించిన చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి మెప్పించారు. నేడు కృష్ణభగవాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.