సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో యాక్షన్ మూవీస్ ఏ రేంజ్ లో చేశారో.. కుటుంబ కథా చిత్రాల్ని కూడా అదే స్థాయిలో చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు. వాటిలో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా కొత్త కాపురం. కృష్ణ, భారతి జంటగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ వాల్యూస్, హ్యూమన్ రిలేషన్స్ ను కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన పి.చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ను ప్రసన్నలక్ష్మి పిక్చర్స్ పతాకంపై జి. వెంకట రత్నం నిర్మించారు. 1975, ఏప్రిల్ 18న విడుదలైన ఈ సినిమా సరిగ్గా నేటికి 45 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పల్లెటూరి వాతావరణాన్ని, పల్లె ప్రజల జీవన విధానాన్ని, వారి కుటుంబాల్ని, అందులోని తగదాల్ని ప్రధానంగా ఆవిష్కరించిన ఈ సినిమాకి కె.వి.మహదేవన్ సంగీతం ప్రాణం పోసింది. గుమ్మడి, పద్మనాభం, చంద్రమోహన్ , సూర్యకాంతం ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. కాపురం . కొత్త కాపురం, ఆలుమగలు కట్టుకున్న అనురాగ గోపురం.. ముంతంత కొప్పులో మూడు సేమంతి పూలు.. కాడి జోడెడ్ల వాడా కరుకైన కుర్రవాడా.. దంచుకో నాయనా ధనియాల పప్పు.. లాంటి పాటలు అప్పటి జనాన్ని ఉర్రూత లూగించాయి. కుటుంబ చిత్రాల్ని ఇష్టపడేవారు ఎప్పుడూ చూడాల్సిన చక్కటి చిత్రం ‘కొత్తకాపురం’.