అభిరుచి గల నిర్మాత. అభ్యుదయ భావాలు కలిగిన దర్శకుడు. మహిళా లోకానికి కాంతినివ్వాలనుకున్న వెండితెర క్రాంతి. తన సినిమాలతో స్త్రీ జాతిని జాగృతం చేయాలని తపించిన ఆయన పేరు క్రాంతి కుమార్. కాసులు కురిపించే కమర్షియల్ చిత్రాలు తీస్తూనే.. ప్రేక్షకులకు మంచి సందేశాలిచ్చే సినిమాలూ నిర్మించారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో తొలుత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన తర్వాత్తర్వాత దర్శకుడిగా కూడా రాణించారు. చిరకాలం గుర్తుండిపోయేలా కొన్ని మంచి చిత్రాల్ని మధుర జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్లారు.

నిర్మాతగా చిరంజీవితో ‘పునాదిరాళ్ళు’, ‘కిరాయి రౌడీలు’, ‘శివుడు శివుడు శివుడు’, ‘అగ్ని గుండం’, ‘రిక్షావోడు’ చిత్రాలను నిర్మించారు. నాగార్జునతో ‘నేటి సిద్దార్థ’ తీశారు. ‘అరణ్య కాండ’కు దర్శకత్వం వహించారు. అలా కొన్ని కమర్షియల్‌ చిత్రాలు తీసినా మహిళా చిత్రాల దర్శకుడిగానే క్రాంతికుమార్‌ ప్రఖ్యాతి గడించారు. ఆయన చిత్రాలకు అనేక అవార్డులు, పురస్కారాలు లభించాయి. నిర్మాతగా పలు చిత్రాలు రూపొందించిన క్రాంతి కుమార్‌ దర్శకుడిగా కూడా సృజన చాటుకున్నారు. బయట సంస్థల చిత్రాలకు కూడా పనిచేసారు. క్రాంతి కుమార్‌కి ఎంతో పేరు తెచ్చిన ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రం కూడా విఎంసి ప్రొడక్షన్‌ పతాకంపై నిర్మాత దొరస్వామి రాజు కోసం పనిచేసినదే. ‘స్వాతి’, ‘అగ్నిగుండం’, ‘స్రవంతి’, , ‘అరణ్యకాండ’, ‘శారదాంబ’, ‘గౌతమి’, ‘నేటి సిద్దార’్ధ, ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘అక్కమొగుడు’, ‘రాజేశ్వరి కళ్యాణం’, ‘భలే పెళ్ళాం’, ‘సరిగమలు’, ‘పాడుతా తీయగా’, ‘అరుంధతి’, ‘9 నెలలు’ చిత్రాలకు దర్శకుడిగా పనిచేసారు. ఖ్యాతి గడించారు. నేడు క్రాంతి కుమార్ జయంతి. ఈ సందర్భంగా ఆయనకి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!