ఆయన బాణీకి తిరుగు లేదు. ఆయన పాటకు ఎదురులేదు. టోటల్ గా ఆయన సంగీతానికి సాటే లేదు. ఆయన పేరు కోటి.  శ్రావ్యమైన బాణీలకు , రస హృదయులను మెప్పించే పాటలకు కేరాఫ్ అడ్రెస్ ఆయన. ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు వారసుడైన కోటి మెలోడీ బాణీకి పెట్టని కోట. సుమారుగా 500 చిత్రాలకి స్వరాలు సమకూర్చిన అగ్ర సంగీత దర్శకుడాయన. తెలుగు, తమిళం, కన్నడ పరిశ్రమలకి సుపరిచితుడు. రాజ్‌తో కలిసి రాజ్‌ – కోటి ద్వయంగా దక్షిణాది చిత్ర పరిశ్రమపై తమదైన ముద్ర వేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు కె.చక్రవర్తి దగ్గర సహాయకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన కోటి విజయవంతమైన ఎన్నో చిత్రాలకి స్వరాలు సమకూర్చారు. మణిశర్మ, ఎ.ఆర్‌.రెహమాన్‌ వంటి ప్రముఖ దర్శకులు వాళ్ల కెరీర్‌ ఆరంభంలో కోటి దగ్గర శిష్యరికం చేశారు.

దాదాపు 10 ఏళ్ళపాటు రాజ్ తో కలిసి సంగీత ప్రయాణం చేశారు కోటి.  ఆ తర్వాత అభిప్రాయ బేధాలొచ్చి.. ఎవరికివారే విడిపోయారు. 1995 నుంచి కోటి సొంతంగా మ్యూజిక్ డైరెక్షన్ చేస్తూ వచ్చారు. ‘అమ్మ దొంగ’, ‘అల్లుడా మజాకా’, ‘భలే బుల్లుడు’, ‘రిక్షావోడు’, ‘సంకల్పం’, ‘ఆయనకీ ఇద్దరు’, ‘తెలుగు వీర లేవరా’, ‘తపస్సు’, ‘పెద్దరాయుడు’, ‘శుభమస్తు’, ‘పెళ్ళాల రాజ్యం’, ‘వంశోద్ధారకుడు’, ‘సరదాబుల్లోడు’, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’, ‘నాయుడుగారి కుటుంబం’, ‘సోగ్గాడి పెళ్ళాం’, ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘పెద్దన్నయ్య’, ‘ముద్దుల మొగుడు’, ‘హిట్లర్’, ‘శుభాకాంక్షలు’, ‘చిలక్కొట్టుడు’, ‘కలెక్టర్ గారు’ ఇలా చాలా సినిమాలకు సంగీత సహకారం అందించారు. ‘అబ్బాయిగారి పెళ్లి’, ‘బొబ్బిలి దొర’, ‘గోకులంలో సీత’, ‘మా నాన్నకి పెళ్లి’, ‘జగదేకవీరుడు’, ‘తారకరాముడు’, ‘కన్యాదానం’, ‘గిల్లి కజ్జాలు’, ‘స్నేహితులు’, ‘శ్రీమతి వెళ్ళొస్తా’, ‘పిల్ల నచ్చింది’…ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలున్నాయి. హలో బ్రదర్ సినిమాకి సంగీతం సమకూర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు పురస్కారాన్ని రాజ్ కోటి అందుకున్నారు. జనరంజకమైన పాటలు చేసి ఎన్నో  సంచలనాలు నమోదు చేసారు కోటి. నేడు కోటి పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

 

Leave a comment

error: Content is protected !!