నటనలో సహజత్వం.. హావభావాల్లో భిన్నత్వం.. డైలాగ్ డెలివరీలో వైవిధ్యం.. బాడీ లాంగ్వేజ్ లో విలక్షణం.. ఆయన లక్షణాలు. మెథడ్ యాక్టింగ్ లో ఆయనకు ఆయనే సాటి. ఏ పాత్రను పోషించినా.. అందులో పరిపూర్ణత ఆయన శైలి. ఎలాంటి సన్నివేశంలో నటిస్తున్నా.. ఆ పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకోవడం ఆయన నైజం. అందుకే ఆయన నటనకి పెట్టని కోట అనిపించుకున్నారు. పేరు కోట శ్రీనివాసరావు. విలన్ గానూ, హాస్యనటుడిగానూ, కేరక్టర్ ఆర్టిస్ట్ గానూ ఇలా రకరకాల పాత్రలతో తెలుగువారి అభిమాన నటుడుగా మారిన కోట దాదాపు 600లకు పైగానే చిత్రాల్లో నటించి మెప్పించారు.

కంకిపాడులో జన్మించిన కోట శ్రీనివాసరావు స్టేట్‌బ్యాంక్‌లో ఉద్యోగంతో ప్రస్థానం ప్రారంభించారు. బాల్యం నుంచే నాటకాలపై ఆసక్తి మెండుగా ఉన్న ఆయన ‘ప్రాణం ఖరీదు’తో సినీ రంగ ప్రవేశం చేశారు. దర్శకనిర్మాత క్రాంతి కుమార్‌ ‘ప్రాణం ఖరీదు’ నాటకాన్ని చూసి సినిమాగా తీయాలనుకొన్నారు. ఆ నాటకంలో నటించిన నటుల్నే సినిమా కోసం ఎంపిక చేసుకొన్నారు. అలా ఆ నాటకంలో ఓ కీలక పాత్ర పోషించిన కోట కూడా సినిమాలో నటించారు. అంతే తప్ప ఆయన సినిమాల కోసం ఎప్పుడూ సీరియస్‌గా ప్రయత్నించింది లేదట. అయితే  ప్రతిఘటన చిత్రంలోని  కాశీ పాత్రలో ఆయన అద్భుత అభినయానికి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక  ‘అహనా పెళ్లంట’లో చేసిన పిసినిగొట్టు పాత్రతో విశేషంగా పేరు రావడంతో సినిమాల్లో బిజీ అయిపోయారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, డెక్కనీ భాషల్లో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొన్నారు కోట. ‘అహనా పెళ్లంట’తో పాటు, ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’, ‘శివ’, ‘శత్రువు’, ‘మనీ’, ‘గాయం’, ‘గోవిందా గోవిందా’, ‘హలో బ్రదర్‌’, ‘ఆమె’, ‘అనగనగా ఒక రోజు’, ‘గణేశ్‌’, ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’, ‘ఠాగూర్‌’, ‘మల్లీశ్వరి’, ‘అతడు’, ‘పౌర్ణమి’, ‘బొమ్మరిల్లు’, ‘సర్కార్‌’, ‘రెడీ’, ‘లీడర్‌’, ‘ఆడవారి మాటలకి అర్థాలే వేరులే’, ‘అత్తారింటికి దారేది’, ‘దూకుడు’ తదితర చిత్రాల్లో కోట పోషించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 600 పైచిలుకు చిత్రాల్లో నటించిన ఘనత కోట సొంతం. కోటకి 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం అందజేసే నంది పురస్కారాలు 9 వరించాయి కోటని. అల్లు రామలింగయ్య పురస్కారంతో పాటు, పలు పురస్కారాలు ఆయన్ని వరించాయి. నేడు కోట శ్రీనివాసరావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా  ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

 

 

 

Leave a comment

error: Content is protected !!