కొందరు నటులు కొన్ని పాత్రల కోసమే పుడతారు. ఆ పాత్రల్లో వారిని తప్ప వేరే వారిని ఊహించుకోని రీతిలో వారి అభినయం ఉంటుంది. అలా జంధ్యాల గారి అహనా పెళ్ళంట సినిమాలో లక్ష్మిపతి పాత్ర కోట కోసమే పుట్టింది అనిపిస్తుంది. అలాగే… ఆ పాత్ర కోసమే ఆయన పుట్టారు అనిపిస్తుంది. పిసినారి తనానికి పరాకాష్టగా లక్ష్మిపతి పాత్రను డిజైన్ చేశారు జంధ్యాల. ఆ పాత్ర సినిమాకే హైలైట్ అన్న సంగతి తెలిసిందే.
నిజానికి కోట శ్రీనివాసరావు చేసిన ఈ పాత్ర కోసం ముందుగా రావుగోపాలరావును అనుకున్నారట జంధ్యాల. అయితే అంతకు ముందు కోట మండలాధీశుడు అనే సినిమాలో యన్టీఆర్ గా అభినయించి.. మంచి పేరు తెచ్చుకున్నారు. దాంతో జంధ్యాల కోట శ్రీనివాసరావు తోనే లక్ష్మీపతి పాత్రను చేయించాలని ఫిక్స్ అయిపోయారట. దానికి సురేష్ ప్రొడక్షన్స్ వారు అబ్జెక్షన్ చేసినా.. జంధ్యాల.. వారిని ఒప్పంచి మరీ కోట చేత ఆ పాత్రను పోషింపచేసి.. ఆయన కెరీర్ ను సరికొత్త మలుపు తిప్పారు. కోడిని గాల్లో వేళ్ళాడగట్టి.. లొట్టలేసుకొని అన్నం తినడం.. బస్టాండ్ లో టీ అమ్ముకోవడం .. న్యూస్ పేపర్ ను ఒంటికి చుట్టుకోవడం లాంటి సీన్స్ లో కోట అభినయం అనితర సాధ్యం. ఏదేమైనా జంధ్యాల ముందుచూపుకి హాట్సాఫ్ చెప్పాల్సిందే.