వ్యంగ్యం, హాస్యం మేళవించే పాటలు రాయడంలో ఆయన దిట్ట. ఆ సూత్రానికి తగ్గట్టుగానే ఆయన వందలాది గీతాల్ని అలవోకగా రాసి వాటిని శ్రోతల నాలుకలమీద నర్తింపచేశారు. జానపదగీతాల్లోని లాలిత్యాన్ని, ఆ పొగరూ వగరూ ఏమాత్రం తగ్గకుండా తెలుగు సినిమాకు అమర్చిపెట్టింది ఆయనే . ఏరువాక సాగాలోరన్నో… అంటూ సేద్యగాళ్ళకు ఉత్సాహం రేకెత్తేలా ధైర్యం చెప్పినా, రామయతండ్రి ఓ రామయ తండ్రి మానోములన్ని పండినాయి రామయ తండ్రీ… అని గుహుడి చేత శ్రీరాముడ్ని ఏరు దాటించినా ఆయాపాటల్లో ఆద్యంతం ఆయన ముద్ర ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ఆయన పేరు కొసరాజు రాఘవయ్య చౌదరి.
కొసరాజు బహుభాషా కోవిదుడైనా, మాతృభాష తెలుగంటే ప్రాణం…అందులో జానపదం ఆయన శ్వాస.. అందుకే ఆయన ఎన్ని రకాల పాటలు రాసినా, జానపద కవిసార్వభౌమునిగానే జనం మదిలో నిలిచారు . ఇక కొసరాజు కొన్ని పాటలకే పరిమితం అని చాలామంది భావిస్తారు కానీ, ఆయన అన్ని రకాల గీతాలకూ న్యాయం చేశారు… తన వద్దకు వచ్చిన ప్రతి అవకాశానికీ వన్నెలద్దారు… జానపదమైనా, సాంఘికమైనా అనువైన పదాలు పలికించారు. పౌరాణికంలోనూ సందర్భోచితంగా కవిరాజు కలం కదం తొక్కింది. ఓ సినిమాలో మొత్తం పాటలను కొసరాజు రాసిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి… అయితే ఆయన మాత్రమే న్యాయం చేయగలరని భావించి, కొసరాజు వద్దకే చేరిన పాటలు ఎన్నో ఉన్నాయి… ఆ పాటలే థియేటర్లలో జనాలకు పూనకం వచ్చేలా చిందులు వేయించిన సందర్భాలూ ఎన్నెన్నో… కొసరాజు తరువాత ఎందరు వాడుక మాటలతో ఆడుకోవాలని ప్రయత్నించినా ఆయన వడి ఎవరికీ అలవడలేదనే చెప్పాలి! … కొసరాజు గీతాలు ఈ తరం వారినీ ఓలలాడిస్తూనే ఉన్నాయి. నేడు కొసరాజు జయంతి. ఈ సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.