ఆయన ఆలోచనలకు ఎదురులేదు. ఆయన కథలకు తిరుగులేదు. టోటల్ గా ఆయన సినిమాలకు అపజయమే లేదు. సామాజిక సమస్యలే ఆయన కథాంశాలు. కమర్షియాలిటిని, రియాలిటీని మిక్స్ చేసి హీరోలకు తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టడంలో ఆయన మాస్టర్. కథకుడిగా , దర్శకుడిగా.. ఆయన ప్రస్థానం టాలీవుడ్ లో అనితర సాధ్యమైనది. పేరు కొరటాల శివ. ఆ పేరు ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక బ్రాండ్. ప్రతీ స్టార్ హీరో ఆయన సినిమాల్లో నటించాలని కోరుకొనే రీతిలో ఆయన దర్శక ప్రస్థానం కొనసాగుతోంది.
బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరారు. ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం, ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారాడు . తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న కొరటాల .. ఆ తర్వాత మహేశ్ బాబు తో తెరకెక్కించిన ‘శ్రీమంతుడు’, యన్టీఆర్ ‘జనతాగ్యారేజ్’, మళ్లీ మహేశ్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రాలతోనూ వరుస బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకున్నారు. వరుసగా నాలుగు చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న కొరటాల శివ .. టాలీవుడ్ లోని అజేయ దర్శకుల లిస్ట్ లోకి చేరిపోయారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో కూడా ఆయన బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటాడని అందరూ నమ్ముతున్నారు. నేడు కొరటాల శివ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ అజేయ దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.