దర్శకులు చాలా మంది ఉన్నారు. అయితే తన గురువు ను మనస్ఫూర్తిగా నమ్మి… దర్శకుడిగా ఆయన బాటలోనే పయనించి.. సినిమాల సంఖ్యలోనూ గురువును ఫాలోఅయి.. ఆయన పేరు నిలబెట్టిన శిష్యులు చాలా అరుదు. అలాంటి శిష్యుల్లో టాలీవుడ్ ఎప్పుడూ మరిచిపోని.. మరపురాని దర్శకుడు కోడి రామకృష్ణ. గురువు శతాధిక సంఖ్యలో సినిమాలు తీస్తే… తాను ఆయనకేమాత్రం తీసిపోనని  దాదాపు అదే స్థాయిలో  చిత్రాలు తీసిన దిగ్దర్శకుడు ఆయన. ఆ గురువు దాసరినారాయణరావు . టాలీవుడ్ లో కుటుంబ కథలకు , డ్రామా, సెంటిమెంట్ స్టోరీస్ కు పెట్టింది పేరు కోడిరామకృష్ణ. అంతేకాదు .. టాలీవుడ్ కు విజువల్ ఎఫెక్ట్స్ ను పరిచయం చేసి… ప్రేక్షకుల మనసుల్లో భక్తి విత్తును నాటిన దర్శకుడూ ఆయనే.

దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢసంకల్పం ఏర్పడింది. దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికనూ వెలిబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తిచేసుకుని వస్తే చూద్దామనడంతో రామకృష్ణ డిగ్రీ పూర్తిచేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. ఎవరికి వారే యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న మూడు సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తూన్న కోడి రామకృష్ణ, ఎలాగైనా దాసరిని దర్శకుణ్ణి చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు . కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’. దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయం చేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. తెలుగులో  వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. అలా కోడి రామకృష్ణ శతాధిక సంఖ్యంలో చిత్రాలు తీసి గురువు పేరు నిలబెట్టారు. నేడు కోడిరామకృష్ణ జయంతి. ఈ సందర్భంగా ఆయన కు మూవీ వాల్యూమ్ ఘన నివాళులర్పిస్తోంది.

 

Leave a comment

error: Content is protected !!