డైనమిక్ హీరోయిన్ , లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ లాంటి బిరుదులతో ఒకప్పటి దక్షిణాది ప్రేక్షకుల మనసు దోచిన కథానాయిక విజయశాంతి. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అయినా సరే ఆమె కెరీర్ కు ఒక మేలి మలుపు లాంటి చిత్రం ‘కర్తవ్యం’. సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ. మోహన్ గాంధీ దర్శకత్వంలో ఏ.యం.రత్నం నిర్మించిన ఈ సినిమా జూన్ 29, 1990న విడుదలై .. ఘన విజయం సాధించింది. నేటికి సరిగ్గా 31 ఏళ్ళు పూర్తిచేసుకున్న ‘కర్తవ్యం’ చిత్రం విజయశాంతికి ఎంతో ప్రత్యేకమైనది.
సిన్సియర్ పోలీసాఫీసర్ అయిన వైజయంతికి.. ముద్దు కృష్ణయ్య అనే రాజకీయ చీడపురుగు తారసపడతాడు. అనుక్షణం అతడి దుష్ట చర్యలకు అడ్డు తగులుతూ ఉండే ఆమె .. ఒకరోజు దాడికి గురవుతుంది. కాళ్ళకి, చేతులకు బలమైన దెబ్బలు తగలడం వల్ల.. ఆమె లేచి నడవలేని స్థితికి చేరుకుంటుంది. అయినాసరే ఆమె దేశ క్షేమం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం అతి తక్కువ సమయంలోనే కోలుకొని .. ముద్దు కృష్ణయ్య ఆటకట్టించి.. తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. ముద్దు కృష్ణయ్య గా ఒకప్పటి నిర్మాత పుండరీకాక్షయ్య విలన్ పాత్రలో జీవించి.. ప్రేక్షకుల్ని ఔరా అనిపించారు. ఇక వైజయంతిగా విజయశాంతి అద్భుతంగా నటించింది . ఈ చిత్రం కమర్షియల్‌గానే కాకుండా అవార్డులను సైతం సొంతం చేసుకుంది. ఇందులో నటించినందుకు విజయశాంతికి ‘జాతీయ ఉత్తమనటి’ అవార్డుతో పాటు ‘ఫిలింఫేర్, నంది’ అవార్డులు లభించాయి. కాగా.. ఇప్పటికీ ఈ సినిమా విడుదలై మూడు దశాబ్దాలు గడిచాయి. అయినా సరే.. ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేషనల్ ఫిలిం ఆర్కివ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్ఐ) కర్తవ్యం సినిమా తెలుగు, హిందీ పోస్టర్స్ ను’ రిలీజ్ చేసింది. ‘కర్తవ్యం’ సినిమాను హిందీలో ‘తేజస్విని’ పేరుతో రీమేక్ చేశారు. హిందీలోనూ ఈ సినిమా ఘన విజయం సాధించింది.