ఆకర్షించే అందం… ఆకట్టుకొనే కళ్ళు.. చిరునవ్వు చిందించే మోము.. చిలిపితనం మేళవించిన చూపులు.. కలగలిస్తే ఆమె. ఇటు గ్లామర్ ను , అటు అభినయాన్ని బ్యాలెన్స్ చేస్తూ… దక్షిణాది సినీ వినీలాకాశంలో అందాల చందమామగా వెలుగొందుతోన్న ఆమె పేరు కాజల్ అగర్వాల్ .
తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 13 యేళ్లు అవుతున్నా… ఇప్పటికీ కాజల్ తన అందంతో మాయ చేస్తోంది. అందం మాత్రమే కాదు.. అంతకుమించిన అభినయం కూడా అంటూ.. ‘లక్ష్మీకళ్యాణం’, ‘చందమామ’తోనే నిరూపించిన ఆమె, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తెలుగుతో పాటు, తమిళంలోనూ సత్తా చాటింది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మగధీర’తో ఆమె స్థాయి మరింత పెరిగింది. ‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, ‘బృందావనం’, ‘తుపాకీ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ఎవడు’, ‘టెంపర్’, ‘బ్రహ్మోత్సవం’ తదితర చిత్రాలు కాజల్‌కి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కొంతకాలంగా నటనకి ప్రాధాన్యమున్న పాత్రలపై దృష్టిపెడుతోంది కాజల్. తన యాభయ్యో చిత్రంగా చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’తో పాటు, ‘అ!’ అనే చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. ‘జనతా గ్యారేజ్’తో ప్రత్యేక గీతాలకీ సై అంది. పంజాబీ కుటుంబానికి చెందిన కాజల్ ముంబైలో జన్మించింది. ముంబైలోనే మాస్ మీడియాలో డిగ్రీ చేసిన కాజల్ ‘క్యూ హో గయా నా’ చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. అప్పట్నుంచి సినిమాలపై మక్కువ పెంచుకొన్న ఆమె దక్షిణాదివైపు దృష్టిపెట్టి రాణించింది. ఈ మధ్యనే బిజినెస్ మెన్ గౌతం ని పెళ్ళాడింది కాజల్ , ప్రస్తుతం చిరంజీవితో ‘ఆచార్య’లో కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు2’ చిత్రంలో నటిస్తోంది. నేడు కాజల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ అందాల చందమామకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే కాజల్ ..