అచ్చెరువొందించే అభినయం… అహో.. అనిపించే ఆంగికం..  గంభీరమైన కంఠస్వరం.. స్పష్టమైన ఉచ్ఛారణ.. కలగలిస్తే కైకాల సత్యనారాయణ. నవరసాల్ని అవలీలగా పండించే ప్రతిభాశాలి ఆయన.  వైవిధ్యమైన పాత్రలు.. విలక్షణమైన పాత్ర పోషణ.. పాత్రలో పరకాయ ప్రవేశం ఆయన ప్రత్యేకతలు. పౌరాణిక జానపదాల్లోను, ఇటు చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాలలోను తనదైన శైలితో మెప్పించిన గొప్ప నటుడు ఆయన. ఎనభై రెండేళ్ల వయసుని, ఎనిమిది వందల సినిమాలతో అరవై ఏళ్ల నటనానుభవాన్ని, అన్నిటినీ మించి అసాధారణ జీవితసారాన్ని అవపోసన పట్టిన మహామేధావి.

సిపాయి కూతురు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు కైకాల సత్యనారాయణ. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయింది.. దాంతో ఆయన  తదుపరి చిత్రంలో అవకాశాలు దక్కించుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈలోపు..  ఆయన యన్టీఆర్ కు డూప్ గా కొన్ని సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌ చొరవతో మోడరన్‌ థియేటర్స్‌ వారి ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో అతిధి నటుడిగా నటించారు. ఈ సినిమా దర్శకుడు ఎస్‌.డి.లాల్‌ విఠలాచార్య శిష్యుడు కావటంచేత, సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి విఠలాచార్యకు చెప్పి ప్రతినాయకునిగా ‘కనకదుర్గ పూజామహిమ’లో నటింపజేశారు. అందులో సత్యనారాయణ పోషించిన సేనాధిపతి పాత్ర అతన్ని విలన్‌గా నిలబెట్టింది. ఆపై హీరోగా నిలదొక్కుకోవలసిన సత్యనారాయణ దుష్ట పాత్రలకు పరిమితం కావలసి వచ్చింది. బి.ఎన్‌.రెడ్డి కూడా ‘రాజమకుటం’ సినిమాలో సత్యనారాయణ చేత చిన్న పాత్ర పోషింపజేశారు. అక్కడ నుంచి ఆయన టాలెంట్ కు మంచి మంచి అవకాశాలు వచ్చిపడ్డాయి. ‘శ్రీకృష్ట పాండవీయం’, ‘పాండవవనవాసం’లో ఘటోత్కచునిగా, ‘శ్రీకృష్ణావతారం’, ‘కురుక్షేత్రం’లో సుయోధనుడిగా, ‘దానవీరశూరకర్ణ’లో భీమునిగా, ‘చాణక్య చంద్రగుప్త’లో రాక్షస మంత్రిగా, ‘సీతాకల్యాణం’లో రావణాసురునిగా, అసమాన నటనను ప్రదర్శించారు.

ఇక సత్యనారాయణ వెనుకకు తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ‘కథానాయిక మొల్ల’లో శ్రీకృష్ణదేవరాయలుగా నటించి మెప్పించారు. ‘ఉమ్మడికుటుంబం’ సినిమాలో ఎన్టీఆర్‌కు జాలిగొలిపే అన్నగా, ‘వరకట్నం’లో కృష్ణకుమారి సోదరునిగా అద్భుతనటన ప్రదర్శించారు. ‘శారద’ సినిమాతో సత్యనారాయణ మంచి కేరక్టర్‌ నటునిగా గుర్తింపు పొందారు. ‘ప్రేమనగర్‌’లో కేశవవర్మ పాత్రలో సత్యనారాయణ జీవించారు. ‘అడవిరాముడు’, వేటగాడు’ సినిమాల్లో విభిన్నమైన విలన్‌ పాత్రలు పోషించి  మెప్పించారు. ప్రస్తుతం సినిమాలకు స్వస్తి చెప్పిన కైకాల పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.

 

Leave a comment

error: Content is protected !!