తెలుగు సంస్కృతిని తన సినిమాలతో వెలిగించి, తెలుగు వారి ఆత్మా గౌరవాన్ని  కొండంత ఎత్తుకు తీసుకెళ్ళిన కళా తపస్వి కె. విశ్వనాథ్. నిన్న ఆయన 91వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన పాటలతో కూడిన ప్రత్యేక కార్యక్రమాన్ని లమాకాన్ వేదికగా చేపట్టింది మూవీ వాల్యూమ్. పలువురు విశ్వనాథ్ అభిమానులు మరియు సినీ ప్రియులు ఈ కార్యక్రమాన్నిజయప్రదం చేశారు. ప్రముఖ సాహితీ వేత్త, రచయిత కూచి ప్రసంగీకులు గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి విశ్వనాథ్ ప్రియ శిష్యుడు, నటులు, గాయకులు జిత్ మోహన్ మిత్ర, ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయుడు ఏడిద రాజా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంకా .. సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విశ్వనాథ్ గురించి ఎన్నో ఆసక్తకరమైన విశేషాలు తెలిపారు.

’విశ్వనాథ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని  జరగబోయే కార్యక్రమం అనగానే.. రాజమండ్రి నుంచి ఇక్కడకు రెక్కలు కట్టుకొని వాలిపోయాను. అసలు విశ్వనాథ్ గారి గురించి చెప్పాలంటే.. ఒక గ్రంథమే అవుతుంది. నేను ఈ రోజు మీముందుకు ఇలా ఈ స్థితిలో ఉన్నాననంటే.. అంతా విశ్వనాథ్ గారి చలవే.  మా అన్నగారి ద్వారా పరిచయం అయిన గురువుగారు.. శంకరా భరణంలో నాకు అద్భుతమైన పాత్రను ఇవ్వడమే కాకుండా.. హల్లో శంకర శాస్త్రి అనే పాటను పాడే అవకాశం కూడా ఇచ్చి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నాకు మంచి మంచి పాత్రలిచ్చి..  ఈ రోజు నేను ఈ స్థితిలో ఇలా మీ ముందుకు రావడానికి కారణమయ్యారు. అది నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను‘ అంటూ విశ్వనాథ్ పట్ల తన భక్తిని, కృతజ్నతను చాటుకున్నారు జిత్ మోహన్ మిత్ర.

అలాగే.. విశ్వనాథ్ గారితో  తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని, ఆయన తమ బ్యానర్ లో తెరకెక్కించిన సినిమాల విశేషాలు తెలియచేస్తూ.. ఏడిద శ్రీరామ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మూవీ వాల్యూమ్ టీమ్ కు అభినందనలు తెలిపారు.

Leave a comment

error: Content is protected !!