ఖద్దరు పంచెకట్టు.. ఫ్రెంచ్ మీసకట్టు.. పొట్టి చేతుల చొక్కా, మెడచుట్టూ తెల్ల తువ్వాలుతో అచ్చంగా పల్లెటూరి వాడ్ని తలపిస్తాడు ఆయన. అయితే ఆయన విద్యాధికుడని, తెలుగు సినిమాను శాసించి.. శ్వాసించే దిగ్గజం అని ఎవరూ అనుకోరు. ఆయనే తెలుగు సినిమా వెలుగు.. స్ర్కీన్ ప్లే మెరుపు కె.వి.రెడ్డి. ఆయన ఒకో సినిమా ఒక ఆణిముత్యం. ఇప్పటి తరం దర్శకులకు అవి పాఠ్యాంశాలు. తెలుగు సినిమా స్వర్ణయుగంగా భావించే కాలంలో పలు విజయవంతమైన, విమర్శకులు ఆణిముత్యాలుగా అభివర్ణించిన సినిమాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి. ఆయన దర్శకునిగా మొత్తం 14 సినిమాలు తీయగా వాటిలో 10 వాణిజ్యపరంగా మంచి విజయాన్ని సాధించినవే. దర్శకునిగా దాదాపు మూడు దశాబ్దాల కాలం పనిచేశారాయన.
కె.వి.రెడ్డికి దర్శకత్వంలో ప్రత్యేకమైన పద్ధతి ఉండేది. ఒక సినిమా చేసేప్పుడు పూర్తి శ్రద్ధ దాని మీదే పెట్టేవారు. చాలా కసరత్తు చేసి స్క్రిప్టు పూర్తిచేయడం, ఒక్కసారి బౌండ్ స్క్రిప్టు పూర్తయ్యాకా ఇక దానిలో చిత్రీకరణ దశలో ఏమాత్రం మార్పుచేయకపోవడం ఆయన పద్ధతి. ఆ స్క్రిప్టు చేతిలో ఉంటే.. ఎవరైనా డైరెక్ట్ చేయవచ్చు అనే స్థాయిలో ఉండేది. ఎన్ని అడుగుల ఫిల్మ్ తీయాలనుకుంటే అన్నే అడుగులు తీయగలగడం ఆయన ప్రత్యేకతల్లో ఒకటి. ముందు రిహార్సల్స్ చేయించి, సంతృప్తిగా వచ్చాకే షూటింగ్ చేసేవారు. దుక్కిపాటి మధుసూదనరావు, ఎన్.టి.రామారావులు తమకు కె.వి.రెడ్డి గురుతుల్యుడని చెప్పుకునేవారు. అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ స్థాపించాకా తొలి చిత్రం కె.వి.రెడ్డితో తీసి, ఆయన పద్ధతులు నేర్చుకుని, తమ సంస్థను ఆ ప్రకారం నడుపుదామన్న ఉద్దేశంతో రెండేళ్ళు వేచి చూసి మరీ సినిమా తీశారు. ఎన్.టి.రామారావు తాను దర్శకత్వం వహించడం మొదలుపెట్టాకా కె.వి.రెడ్డిని చూసి నేర్చుకున్న పద్ధతులను సాధ్యమైనంత అనుసరించేవారు. కె.వి.రెడ్డి తీసిన భక్త పోతన సినిమా విజయం వల్ల వాహినీ ప్రొడక్షన్స్ ఏర్పడగా, పాతాళ భైరవి సాధించిన ఆర్థిక విజయం విజయా సంస్థ స్థిరపడడానికి సహకరించింది. ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, అల్లు రామలింగయ్య వంటి నటులు, పింగళి నాగేంద్రరావు, డి.వి.నరసరాజు, కొసరాజు రాఘవయ్య చౌదరి వంటి కవి రచయితల సినిమా కెరీర్లు స్థిరపడడానికి కె.వి.రెడ్డి సినిమాల ప్రభావం చాలా ఉంది. ప్రత్యేకించి అప్పటివరకూ కృష్ణుడి పాత్రలో పెద్దగా విజయం సాధించని ఎన్.టి.రామారావును కృష్ణుడిగా నిలబెట్టి, ఆయన పౌరాణిక చిత్రాల కెరీర్ కు పునాదులు వేసింది కె.వి.రెడ్డే. ఆయన సినిమాల్లో పెద్దమనుషులు, పెళ్లినాటి ప్రమాణాలు ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ బహుమతి సంపాదించుకోగా 2013లో సిఎన్ఎన్-న్యూస్ 18 నిర్వహించిన పోల్లో భారతీయ ప్రేక్షకులు ఇప్పటివరకూ వచ్చిన భారతీయ సినిమాల్లో అత్యుత్తమంగా మాయాబజార్ ఎంచుకున్నారు. ఇక 60వ దశకం మలి భాగంలో కె.వి.రెడ్డి తీసిన సత్య హరిశ్చంద్ర , ఉమా చండీ గౌరీ శంకరుల కథ, భాగ్యచక్రం సినిమాలు వరుసగా పరాజయం పాలు కావడంతో ఆయనతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకురాని స్థితి ఏర్పడింది. ఈ స్థితిలో కె.విని గురువుగా భావించే ఎన్.టి.ఆర్ ఆయనపై గౌరవాభిమానాల వల్ల తన స్వంత సంస్థ అయిన ఎన్.ఏ.టి. ద్వారా ‘శ్రీకృష్ణసత్య’ సినిమా ఆయన దర్శకత్వంలోనే నిర్మించారు. పరాజయాల వల్ల సినిమా తీసే అవకాశం లేని దుస్థితిలో కెరీర్ ముగించాల్సి వస్తుందన్న భయాందోళనల నుంచి విడిపిస్తూ ఆ సినిమా మంచి విజయం సాధించింది. నేడు కె.వి.రెడ్డి 109వ జయంతి. ఈ సందర్భంగా..ఆ మహాదర్శకునికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.