ఆయన ఫ్రేమ్స్ … వెండితెర కేన్వాస్ పై పెయింటింగ్స్ .. ఆయన షాట్స్ …కమర్షియాలిటీకి నిలువెత్తు రూపాలు.. ఆయన సన్నివేశాలు డ్రామా అండ్ మెలోడ్రామా కలగలిసిన దృశ్యకావ్యాలు. నిన్నటి తరం ప్రేక్షకులకు మాస్ అండ్ క్లాస్ చిత్రాలు అందించిన దర్శకేంద్రుడు ఆయన . పేరు కోవెలమూడి రాఘవేంద్రరావు. ముఖ్యంగా కథానాయికల్ని అందంగా, ముగ్ధమనోహరంగా ఎలివేట్ చేసి పాటలు చిత్రీకరించే ప్రతిభావంతమైన దర్శకుడు ఆయన. అందరు అగ్ర కథానాయకులకు ఎన్నో సూపర్ హిట్స్ అందించిన కమర్షియల్ డైరెక్టర్ ఆయన. తెలుగుతో పాటు, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు తీసిన కె.రాఘవేంద్రరావు శతాధిక చిత్ర దర్శకుల్లో ఒకరు. నిర్మాతగా కూడా ఆయన పలు చిత్రాలు చేశారు. వెండితెరపై ఇంద్రజాలం ప్రదర్శించిన దర్శకుడు కావడంతో ఆయన దర్శకేంద్రుడుగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకొన్నారు.
సీనియర్ దర్శకులు కోవెలమూడి సూర్యప్రకాశావు, కోటేశ్వరమ్మ దంపతులకి కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించారు కె.రాఘవేంద్రరావు. బి.ఎ చదువుకున్న ఆయన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మొదట్లో సహాయ దర్శకుడిగా పనిచేశారు. శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా నటించిన ‘బాబు’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘జ్యోతి’ చేసి పేరు తెచ్చుకున్నారు. తొలినాళ్లలో కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేసినా.. ఆ తర్వాత హీరోయిజంపై దృష్టిపెట్టారు. ప్రతి అగ్ర కథానాయకుడు ఒక్కసారైనా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేయాలని ఆశపడేంతగా ఆయన తెరపై హీరోయిజాన్ని చూపించారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ వంటి సీనియర్లు మొదలుకొని… నవతరంలో మహేష్‌బాబు, అల్లు అర్జున్, నితిన్, మనోజ్‌ల వరకు పలువురు కథానాయకులతో సినిమాలు తీసి విజయాలు అందుకొన్నారు కె.రాఘవేంద్రరావు. అడవిరాముడు, సింహబలుడు, కేడీనెంబర్ 1, డ్రైవర్ రాముడు, వేటగాడు, భలే కృష్ణుడు, ఘరానా దొంగ, రౌడీరాముడు కొంటె కృష్ణుడు, దేవత, జస్టిస్ చౌదరి, కొండవీటి సింహం, బొబ్బిలి బ్రహ్మన్న, కొండవీటి రాజా, అడవిదొంగ, జగదేవకవీరుడు అతిలోక సుందరి, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, చాణక్యశపథం, యుద్ధభూమి, మంచిదొంగ, అపూర్వ సహోదరులు, భారతంలో అర్జునుడు, అగ్నిపుత్రుడు, దొంగరాముడు, ఆఖరి పోరాటం, కూలీ నెం 1, రౌడీఅల్లుడు, సుందరకాండ, అల్లరి మొగుడు, ఘరానా మొగుడు, అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు, పెళ్లి సందడి లాంటి సాంఘిక చిత్రాలే కాకుండా.. శ్రీమంజునాథ, అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి, నమో వెంకటేశాయ లాంటి భక్తిరస చిత్రాల్ని తెరకెక్కించి దర్శకత్వం అనే బాధ్యతాయుతమైన శాఖకు పూర్తి న్యాయం చేకూర్చారు. తరాలు మారినా సరే… ఆయన ప్రేక్షకుల అభిరుచులకి తగ్గ సినిమాలు తీయడంలో దిట్ట. నేడు కె.రాఘవేంద్రరావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆ దర్శకేంద్రుడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.