టాలీవుడ్ లో మాస్ చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రెస్ . దాదాపు అందరు అగ్రతారల్ని డైరెక్ట్ చేసిన సీనియర్ మోస్ట్ జీనియస్ ఆయన. ఒక సినిమాను కమర్షియల్ గా ఎలా మలచాలో.. ఎలాంటి మసాలా ఎలిమంట్స్ తో జనాన్ని థియేటర్స్ కు రప్పించవచ్చో.. బహుశా ఆయనకు తెలిసినట్టు ఇంకే డైరెక్టర్ కు తెలిసి ఉండదు. అందుకే ఆయన దర్శకత్వంలో యన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజే కాదు.. ఆ తర్వాత తరం హీరోలైన చిరంజీవి, బాలయ్య, నాగార్జున , వెంకటేశ్ లాంటి హీరోలు కూడా నటించడానికి ఉర్రూతలూగేవారు. ఆయన పేరు కె. రాఘవేంద్రరావు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఆయన్ను దర్శకేంద్రుడుగా అభివర్ణిస్తుంది.   

1975, మే 2 న విడుదలైన ‘బాబు’ చిత్రంతో కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నేటితో టాలీవుడ్ లో దర్శకుడిగా ఆయన 45 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తండ్రి కె.యస్.ప్రకాశరావు పెద్ద దర్శకుడైనా.. రాఘవేంద్రరావు మాత్రం వి.మధుసూదనరావు దగ్గర దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆయన దగ్గర సినిమా తీసే విధానాన్ని కథకు మసాలాలు అద్ది ఎలా తెరకెక్కించాలి అనే అంశాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు రాఘవేంద్రరావు. ముఖ్యంగా ఆయన పాటలు తీయడం మీద చాలా శ్రద్ధ పెట్టారు. ఆయన దర్శకుడు అయ్యాకా  ఆ అంశంలోనే ఆయన మాస్టర్ అయ్యారు. యన్టీఆర్ అడవిరాముడు చిత్రంతో దర్శకుడిగా తొలి సక్సెస్ అందుకున్న  రాఘవేంద్రరావు .. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. ఆ వెంటనే యన్టీఆర్ తో కేడినెం.1 సినిమాతో రెండో విజయం అందుకొని తనకు తిరుగేలేదని నిరూపించుకున్నారు. యన్టీఆర్ తో వరుసగా కమర్షియల్ సక్సెస్ లు సాధించిన దర్శకేంద్రుడు .. అందరు అగ్ర కథానాయకులతోనూ బ్లాక్ బస్టర్స్ సాధించి సత్తా చాటుకున్నారు. కొంత కాలంగా..  మాస్ చిత్రాలనుంచి .. భక్తి చిత్రాల వైపుకు టర్న్ అయిన ఆయన .. మోహన్ బాబు తో రావణ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అలాగే మరికొన్ని భక్తి చిత్రాలకు ప్లాన్ చేస్తున్నారు.  సో.. టాలీవుడ్ లోకి వచ్చి..  46 ఏళ్ళు దాటినా..  ఆయనలో దర్శకత్వం పట్ల ఆసక్తి ఏమాత్రం సన్నగిల్లలేదు. అదే అంకింత భావం, అదే ఉత్సాహం. దటీజ్ రాఘవేంద్రరావు .

Leave a comment

error: Content is protected !!