రంగస్థలం, సినీమా రంగం ఆయనకు రెండు కళ్ళు. పాత్రోచితమైన నటన.. నటనలో సహజత్వం .. ఆయన లక్షణాలు. ‘కన్యాశుల్కం’ నాటకాన్ని దేశవిదేశాల్లో వెయ్యికిపైగా ప్రదర్శనలిచ్చి ఒక రికార్డు నెలకొల్పారాయన. అందులోని గిరీశం పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అంతే కాకుండా చలనచిత్ర రంగంలో సహాయ నటుడుగా, కథానాయకుడుగా, కేరక్టర్ నటుడుగా దాదాపు నలభై ఐదు సంవత్సరాలపాటు ప్రస్థానం సాగించారు. ఆయన పేరు జె.వి.రమణమూర్తి. శంకరాభరణం శంకరశాస్త్రి .. జెవి సోమయాజులు తమ్ముడిగా కూడా ఆయన బాగా ప్రసిద్ధి.
స్ఫురద్రూపి, మంచి నటన ప్రదర్శించే రమణమూర్తి చేత కె.బి.తిలక్ అనుపమ బ్యానర్ మీద 1957లో తను నిర్మించిన ‘ఎం.ఎల్.ఎ’ సినిమాలో సహాయక పాత్రను పోషింపజేశారు. అందులో జగ్గయ్య, సావిత్రి ప్రధాన భూమికలు నిర్వహించారు. దాని తర్వాత ‘అత్తా ఒకింటి కోడలే’, ‘మంచిమనసుకు మంచిరోజులు’ ‘మాంగల్యబలం’ ‘శభాష్‌రాముడు’ ‘పెళ్లిమీద పెళ్లి’ ‘బావా మరదళ్లు’ సినిమాలు రమణమూర్తికి మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. అలా .. రమణమూర్తి సినీ రంగంలో హీరోగా నిలదొక్కుకుంటుండగా అదృష్టం వెనక్కి లాగింది. ప్రమాదంలో కుడికాలికి పెద్ద దెబ్బ తగిలి చాలాకాలం మంచానికి పరిమితం కావలసి వచ్చింది. ప్రమాదం నుంచి కోలుకున్నాక 1971లో వచ్చిన అన్నపూర్ణా వారి ‘అమాయకురాలు’ చిత్రంలో రమణమూర్తికి మంచి పాత్ర దొరికింది. ఆ తర్వాత ‘కటకటాల రుద్రయ్య’, ‘దొంగల ‘మరోచరిత్ర’, ఆకలిరాజ్యం, ‘సిరిసిరిమువ్వ’ ‘ఇది కథకాదు’ ‘గుప్పెడుమనసు’చిత్రాలు , రమణమూర్తికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. అలాగే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శుభోదయం’, ‘సప్తపది’, ‘శుభలేఖ’, ‘సిరివెన్నెల’ కూడా రమణమూర్తికి మంచి పేరు తెచ్చిపెట్టినవే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు నూట యాభై చిత్రాలకు పైగా నటించిన రమణమూర్తి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆ అభినయ గిరీశానికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.