యన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఒకప్పుడు తెలుగు తెరను వెలిగించాయి. మాస్ జనాన్ని ఉర్రూతలూగించాయి. అభిమాన గణానికి పూనకాలు తెప్పించాయి. ప్రతీ తెలుగువాడి హృదయం ఆరాధనతో ఉప్పొంగింది. ఆనాడు ఒక బ్రాండ్ గా నిలిచిన ఆ మూడక్షరాలు…ఈ జెనరేషన్ లోనూ ఒక వైబ్రేషన్ అయ్యాయి. ఈ తరం ప్రేక్షకుల్ని తన నటనతోనూ, నాట్యంతోనూ, డైలాగ్స్ తోనూ ఒక ఊపు ఊపుతున్నాయి. అతడే యన్టీఆర్ జూనియర్. ఆ తారకరాముడికి మనవడు. తాత , తండ్రి నటవారసత్వం పుణికి పుచ్చుకొని.. తనదైన నటనతో మెప్పిస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకొన్న అతడు .. నిజంగా తాతకు తగ్గ మనవడే. అచ్చం తాతలానే పౌరాణికాల్లోనూ ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోతున్నాడు. సాంఘికాల్ల్లో సరేసరి. బాక్సాఫీస్ దగ్గర కాసులు వర్షించే చిత్రాలకు కేరాఫ్ గా నిలిచాడు. యూత్ ఐకాన్‌గా ప్రేక్షకుల అభినందనలు అందుకుంటున్నాడు. ఆ ఎన్టీఆర్ నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. వైవిధ్యమైన పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తూ… ప్రతిష్ఠాత్మకమైన సంస్థల్లో పనిచేస్తూ సమర్ధత నిరూపించుకుంటున్నాడు.
బాల్యంలో కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందడం యన్టీఆర్ నట జీవితానికి ఎంతగానో పనికి వచ్చింది. సినిమాల్లో సైతం మంచి డాన్సర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎలాంటి క్లిష్టతరమైన పాటలకైనా అడుగులు కదపగల నైపుణ్యం అతడి సొత్తు. మాటల్లో మంటలు. కళ్ళల్లో క్రోధం… అభినయంలో ఆవేశం… వెరసి ఎన్టీఆర్ అని ఆయన అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. సినిమాలోకి రాకముందు వందల సంఖ్యలో కూచిపూడి నృత్యప్రదర్శనలు చేసి రసజ్ఞులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. బ్రహ్మర్షి విశ్వామిత్రలో భరతుడిగానూ, బాలరామాయణంలో రాముడిగానూ అభినయించి అభినందనలు అందుకొన్న జూనియర్ .. ఉషాకిరణ్ మూవీస్ వారి.. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో హీరోగా తెలుగు తెరంగేట్రం చేశాడు. ఆ సినిమా జయాపజయాల సంగతి పక్కనపెడితే.. నటనలో మంచి మార్కులు వేయించుకున్నాడు , ఆ తర్వాత రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో తొలి హిట్టు కొట్టాడు తారక్. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అగ్ర దర్శకులందరి సినిమాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ నటించారు. వి.వి.వినాయక్‌తో ‘ఆది’, ‘సాంబ’, ‘అదుర్స్’, బి. గోపాల్‌తో ‘అల్లరిరాముడు’, ‘నరసింహుడు’, డీకే సురేష్ ‘నాగ’, పూరి జగన్నాథ్‌తో ‘ఆంధ్రావాలా’, ‘టెంపర్’, సురేంద్రరెడ్డితో ‘అశోక్’, ‘ఊసరవెల్లి’, కృష్ణవంశీతో ‘రాఖీ’, మెహర్ రమేష్‌తో ‘కంత్రీ’, బోయపాటి శ్రీనుతో ‘దమ్ము’, శీను వైట్లతో ‘బాద్ షా’, హరీష్ శంకర్‌తో ‘రామయ్య వస్తావయ్యా’, సంతోష్ శ్రీనివాస్‌తో ‘రభస’, సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’, కొరటాల శివతో ‘జనతా గ్యారేజ్’, కె.ఎస్.రవీంద్రతో ‘జై లవకుశ’, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రాల్లో కధానాయకుడిగా నటించాడు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి మహా మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ లో నటిస్తున్నాడు. ఆ సినిమా ఎప్పుడొస్తుందా అని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కొమ్రం భీమ్ గా తారక్ అభినయ విశ్వరూపాన్ని చూడాలన్నది అభిమానుల ఆరాటం. నేడు తారక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే తారక్ ..