Suryakantham : సూర్యకాంతాన్ని హాస్యనటీమణిగా ముద్ర వెయ్యడానికి లేదు. ఆమె ప్రత్యేకంగా హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.. తెలుగు సినిమా చరిత్రలో గయ్యాళి అత్త పాత్ర అంటే అది ఒక్క ” సూర్యకాంతమే”. ఆ మహానటి కి సంబంధించి ఓ స్పెషల్ ఆర్టికల్.
తెలుగునాట ఏ తల్లిదండ్రులూ వాళ్ళ కూతుళ్ళకు తన పేరు పెట్టుకోకుండా చేసింది” అంటూ గుమ్మడి చేసిన నిందా పూర్వక స్తుతి గుర్తొస్తే ఆమె ఎంతటి గయ్యాళితనం ప్రదర్శించిందో అర్థమవుతుంది. అలా అర్థశతాబ్దం పాటు అరుపులు, విరుపులతో నోటిదురుసు చూపి ప్రేక్షకులను అలరించిన సూర్యకాంతం నోరు మూగబోయిన విషయం ప్రపంచానికి తెలియజేసిన వాణ్ణి నేను.
వేళాపాళా లేని రిపోర్టర్ ఉద్యోగజీవితంలో 1994 డిసెంబర్ 17 కూడా అప్పటిదాకా ఒకానొక రోజు మాత్రమే. ఆ రోజు పెద్దగా వార్తలేమీ లేవు. పగలంతా దాదాపుగా ఖాళీగానే ఉన్నా. ఇంటికి బయల్దేర బోతుండగా విజయవాడ ఆంధ్రప్రభ ఆఫీసులో పనిచేసే ఒక జర్నలిస్టు ఫోన్ చేశాడు. వాళ్ళ పైపోర్షన్ లో ఉండే సూర్యకాంతం బంధువులు హడావిడిగా ఇంటికి తాళం వేసి చెన్నై బయల్దేరారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. సూర్యకాంతం గారికి ఏమైనా అయిఉంటుందేమో తెలుసుకొమ్మని పరోక్షంగా నాకు చెప్పాడన్నమాట.
నేను వెంటనే సినిమా డైరెక్టరీ తీసి అందులో ఉన్న సూర్యకాంతం గారి ఇంటి నెంబర్ కి ఫోన్ చేశా. అప్పుడు సెల్ ఫోన్లు లేవు. ఫోన్ రింగవుతూనే ఉంది. ఎవరూ తీయడం లేదు. నేనేమన్నా అతిగా ఊహిస్తున్నానేమోనని కాసేపు అనిపించినా, అలా వదిలేయకూడదన్నది వృత్తి పాఠాల్లో ఒకటి కాబట్టి ఆమె గురించి తెలుసుకోవటానికి రకరకాలుగా ప్రయత్నించా. కనీసం ఆవిడ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం ఉన్నా, నా పని తేలికయ్యేది. ఆమె అస్వస్థత గురించి అడిగితే ఎవరైనా చెబుతారేమోనని ప్రయత్నించి చూశా. దాసరి నారాయణరావు, రేలంగి నరసింహారావు సహా దాదాపు 20 మందికి ఫోన్ చేసి మాట్లాడి ఉంటా. ఆమెకు ఆరోగ్యం బాగా లేదన్న విషయం ఆ మధ్య విన్నామని మాత్రం ఒకరిద్దరు చెప్పారు. కనీసం ఆమె ఇంటివైపు కన్నెత్తి చూసినవారు లేరని అర్థమైంది. వివరాలేవీ తెలియదన్నదే అందరి సమాధానం.
నేరుగా వెళ్ళటం తప్ప మార్గం లేదని అర్థమైంది.
ఆ డైరెక్టరీ లో ఉన్న అడ్రెస్ వెతుక్కుంటూ వెళ్ళా..
అది ఆళ్వార్ పేట లో ఉన్న సి ఐ టి కాలనీ. ఎగువ మధ్యతరగతి వాళ్ళుండే ఆ ప్రాంతానికి సరైన పోలిక హైదరాబాద్ మాసాబ్ టాంక్ లో ఉండే శాంతినగర్. సినిమా వాళ్ళంతా ఉండే టి. నగర్, కోడంబాక్కం, వడపళని లాంటి ప్రాంతాల్లో ఉంటే ఈమె మాత్రమే ఇక్కడ ఎందుకున్నారా అని ఆలోచిస్తూ ఇంటి అడ్రస్ వెతకటం మొదలుపెట్టా. హైదరాబాద్ లో లాగా పొడవాటి గజిబిజి నెంబర్లు కాకుండా కాలనీ పేరు, వీధి పేరు, ఇంటి నెంబర్ స్పష్టంగా ఉండటం మద్రాసు ప్రత్యేకత. అందుకే ఐదు నిమిషాల్లో అడ్రస్ దొరికింది. అప్పటికి రాత్రి తొమ్మిది గంటలైంది. మద్రాస్ నగరంలో ప్రజలు త్వరగా నిద్రపోతారు. ఈ మధ్య పరిస్థితి మారిందిగాని మద్రాస్ గురించి పెంగ్విన్ వాళ్ళు వేసిన 1990 నాటి ఒక పుస్తకంలో కూడా The city goes to sleep early అని రాశారు.
డబ్బున్న వాళ్ళ ప్రాంతం కావటం, చలికాలం కూడా కావటంతో కాలనీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉనాయి. అడ్రస్ పట్టుకోగలిగాను కానీ, ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఆమె ఇల్లేనా అని అనుమానమొచ్చి దగ్గర్లో ఒక ఇంటి వాచ్ మన్ దగ్గరికెళ్ళి అడిగా. ఆ ఇల్లేనని చెప్పాడు తప్ప అంతకుమించి వివరాలేమీ ఇవ్వలేకపోయాడు. మధ్యాహ్నం దాకా ఉన్నారని మాత్రం చెప్పగలిగాడు. ఏం చేయాలో పాలుపోవటం లేదు. అరకిలోమీటర్ నడిచి ఆళ్వార్ పేట దాకా వెళ్ళి ఆఫీసుకు ఫోన్ చేశా… వాళ్ళకేమైనా వివరాలు అందాయేమో తెలుసుకుందామని. ఫలితం శూన్యం. నేనేమైనా చెబుతానేమోనని వాళ్ళే ఎదురుచూస్తున్నారు. ఫోన్ పెట్టేసి మళ్ళీ ఆ ఇంటి దగ్గరికే వచ్చా.
ఓపిగ్గా అక్కడే తచ్చాడుతూ ఉండిపోయా. తొమ్మిదిమ్ముప్పావుకు ఒక తెల్ల అంబాసిడర్ కారు ఆ ఇంటి ముందాగింది. ఒక్కసారిగా అలర్ట్ అయ్యా. అందులో నుంచి ఒక పెద్దాయన దిగాడు. ఆయన వెంట మరో మధ్యవయస్కుడు. ఇద్దరూ ఆ ఇంట్లోకి వెళుతుంటే నేను కూడా మెల్లగా అనుసరించా. వెనుక ఎవరో వస్తున్నట్టు గమనించి న. వెనక్కి తిరిగి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ఇలాంటప్పుడు సంభాషణ మొదలుపెట్టతం చాలా ఇబ్బందికరం. కానీ చల్లకొచ్చి ముంతదాచటం వల్ల ప్రయోజనంలేదు. “ సూర్యకాంతం గారి ఇల్లు… “ అంటూ వాక్యం మధ్యలోనే మింగేశా.
ఆ పెద్దాయన వెంటనే , “బాడీ వెనుక అంబులెన్స్ లో వస్తోంది… ఇంతకీ మీరెవరు?” అన్నారు. నన్ను నేను పరిచయం చేసుకున్నా. ఆ పెద్దాయన సూర్యకాంతం గారి కజిన్ అని, మధ్య వయస్కుడు ఆమె దత్త పుత్రుడైన ఆంధ్రాబ్యాంక్ అధికారి పద్మనాభ మూర్తి అని వాళ్ళను వాళ్ళు పరిచయం చేసుకున్నారు.
ఆంధ్రాకోడళ్ళను హడలెత్తించిన అభిమాన అత్తగారు సూర్యకాంతం ఇక లేరన్న వార్తను వెంటనే ఆఫీసుకు చెప్పాలన్న ఆతృత మొదలైంది. అంబులెన్స్ లో భౌతికకాయం వచ్చేదాకా ఆగటమా, టెలిఫోన్ బూత్ దాకా వెళ్ళి ఫోన్ చేసి రావటమా అని తటపటాయిస్తుండగా సూర్యకాంతంగారి కొడుక్కి నా సమస్య అర్థమైనట్టుంది. ఫోన్ చేసుకుంటారా అని అడిగి నన్ను ఆ ఫోన్ ఉన్న గదిలోకి తీసుకెళ్ళారు. ఆఫీసుకి ఫోన్ చేసి సూర్యకాంతం మరణ వార్తను ధ్రువీకరించా. ఆమె నేపథ్యం, సినిమా జీవితం గురించి వివరంగా రాసి ఉంచితే అరగంటలో ఆఫీసుకొచ్చి మిగిలిన వివరాలతో నింపుతానని చెప్పా.
ఫోన్ పెట్టెయ్యగానే ఆయన మరిన్ని వివరాలు చెప్పాడు. మొదటి సినిమా ధర్మాంగద, చివరి సినిమా వన్ బై టూ లాంటి సంగతులు, కుటుంబ వివరాలు చెప్పారు. ప్రమాదంలో ముఖానికి దెబ్బతగిలిందని ఒక సారి, మరో నటిని తీసేసి అవకాశం ఇచ్చారని తెలిసి అలా ఒకరిని బాధపెట్టి అందుకునే ఆనందం వద్దని ఇంకోసారి హీరోయిన్ ఛాన్స్ జారిపోవటం గురించి చెప్పారు. అవన్నీ రాసుకుంటూ ఉండగానే అంబులెన్స్ వచ్చింది. సూర్యకాంతం గారి కోడలు వెంట వచ్చారు.
అందరం కలిసి సూర్యకాంతం గారి భౌతికకాయాన్ని ఇంట్లోకి చేర్చాం.
కొంతకాలంగా ఆమెకు ఆరోగ్యం బాగాలేదని,
8 గంటల సమయంలో కన్నుమూశారని, బంధువులకు సమాచారం ఇచ్చామని, ఉదయానికి వాళ్ళంతా వస్తారని, సాయంత్రం లోపు అంత్యక్రియలు జరుపుతామని చెప్పారు. వార్త తెలిసి ఎవరైనా వస్తే వస్తారేమోగాని ప్రత్యేకంగా సినిమావాళ్ళెవరికీ చెప్పే ఉద్దేశం కూడా లేదన్నారు. వాళ్ళ ముఖాల్లో నిర్లిప్తత కనిపించింది.
సూర్యకాంతం భౌతికకాయంతోబాటు అక్కడ ఉన్నది ముగ్గురే. సోదరుడు, కొడుకు, కోడలు. సి ఐ టి నగర్ నిద్రలో మునిగిపోయింది. ఆ ముగ్గురికే జాగారం. నేను సెలవు తీసుకొని బయల్దేరి ఆఫీసుకొచ్చా. సినిమా పరిశ్రమతోబాగా అనుబంధం ఉన్న పిళ్ళా శ్రీనివాస్ గారు డెస్క్ లో అప్పటికే వార్త వండేశారు. దాసరి శిష్యరికం మాత్రమే కాదు, పరిశ్రమ అంతా ఆయనకు కొట్టిన పిండి. అందుకే నేనిచ్చిన కొద్దిపాటి వివరాలతో ఆయన చాలా పెద్ద వార్త రాయగలిగారు.
వార్త పూర్తిచేసి బయల్దేరబోయేముందు అనిపించింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్ర ప్రభ తప్ప ఏ పత్రికలోనూ మరుసటి రోజు ఈ వార్త వచ్చే అవకాశంలేదన్న నిజం గుర్తుకొచ్చింది. ఒక మహానటి చనిపోతే ఆ వార్త నాకు మాత్రమే తెలిసినంత మాత్రాన ఇప్పటి న్యూస్ చానల్స్ లా ఎక్స్ క్లూజివ్ అని భుజాలు చరుచుకోవాల్సిన అవసరం లేదు కదా. కానీ, ఆ టైమ్ లో అన్ని పత్రికలకూ ఫోన్ చేసి చెప్పటం కష్టం కాబట్టి న్యూస్ ఏజెన్సీ ‘యు ఎన్ ఐ’ బ్యూరో చీఫ్ గా ఉన్న రమేశన్ కి ఫోన్ చేశా. అందులోనే వెంకట రమణ అనే తెలుగు రిపోర్టర్ ఉన్నారు గాని ఆయన ఈనాడుకు ఫ్రీ లాన్సర్ గా వార్తలు రాస్తూ ఉంటారు. ఆయనకి చెబితే ఈనాడుకు మాత్రమే పంపుతాడనే అనుమానంతో రమేశన్ కి చెప్పాల్సి వచ్చింది. మొత్తానికి ఐదు నిమిషాల లోపే యు ఎన్ ఐ ద్వారా ఆ వార్త దేశమంతటా అందింది. అలా తెలుగునాట పత్రికలన్నీ తెల్లవారే సరికల్లా ఈ దుర్వార్తను అందించగలిగాయి.
వార్త సంగతలా ఉంచితే ఆ రాత్రి నేను ఫోన్ చేసిన 20 మందిలో ఎవరూ మళ్ళీ ఫోన్ చేసి మీకేమైనా వివరాలు తెలిశాయా అని అడిగిన పాపాన పోలేదు. మరునాడు ఉదయం వెళ్ళినప్పుడు బంధువులు మాత్రమే ఉన్నారక్కడ. సినీ ప్రముఖులు చాలామంది రావచ్చునన్న నా అంచనా తలకిందులైంది. అప్పటికి ఆరు నెలల ముందు అక్కినేని లక్ష్మీ వరప్రసాద రావు అనే ఎల్వీ ప్రసాద్ గారు చనిపోయినప్పుడు వచ్చిన వాళ్ళలో పదోవంతు కూడా రాకపోవటం నాకు మింగుడు పడలేదు. అప్పటికి కొద్దిరోజుల కిందటే మూడో విడత ముఖ్యమంత్రి పీఠమెక్కిన ఎన్టీ రామారావు రాలేకపోవటం అర్థం చేసుకోవచ్చునేమోగాని అక్కినేని గాని, గుమ్మడి గాని కడసారి వీడ్కోలు పలికేందుకు రాక పోవటం ఆశ్చర్యంగా అనిపించింది. మద్రాసులో ఉండే సినీ జనాలు కూడా అక్కడ కనబడలేదు. 12 గంటల హైదరాబాద్ విమానంలో సినిమా వాళ్ళెవరూ రాలేదని నిర్థారించుకొని సాయంత్రం 3 గంటల తరువాత అంత్యక్రియలు జరిపారు.
పి.ఎస్:
ఇలాంటి విషాదాన్ని పంచుకునే సమయంలో ఒక అసందర్భ ప్రేలాపన:
నేను పనిగట్టుకొని యు ఎన్ ఐ కి ఫోన్ చేసి మరీ ఈ వార్త చెబుతూ ఉంటే అటువైపుగా వెళుతున్న డెస్క్ ఇన్ ఛార్జ్ జొన్నలగడ్డ లక్ష్మీ నరసింహారావు గారు విన్నారు. ఆయన ఏదైనా చెప్పదలచుకుంటే ఆగి నిలబడి చెబుతారే తప్ప నడుస్తూ చెప్పటం కుదరదంటే కుదరదు. అలాగే ఆ రోజు కూడా ఆగి, యు ఎన్ ఐ కి చెప్పాలన్న నా ఆలోచన చాలా గొప్పదని మెచ్చుకున్నారు. “నా విశాల హృదయాన్ని అభినందిస్తూ” అక్కడికక్కడే ఒక బహుమతి ప్రకటించారు. అదేంటంటే, ఆయన ఎంతో అపురూపంగా చూసుకునే ఆయన కారులో నన్ను ఎక్కించుకొని తిప్పటం. అప్పట్లో ఒక సగటు జర్నలిస్టుకు కారుండటం చాలా గొప్ప విషయం. అయినాసరే, “అదేం భాగ్యం? అది సెకండ్ హాండ్ కారేగా?” అని ఎవరూ పెదవి విరిచే వీల్లేదు. ఎందుకంటే, అది పదేళ్ళపాటు అందాల నాట్య తార జయమాలినిని మోసిన కారు.
-తోట భావనారాయణ