ఆయన నవ్వుకే నవ్వు తెప్పించగలడు. కామెడీకే కితకితలు పెట్టగలడు. హాస్యానికే పొట్టచెక్కలు చేయగలడు. ఒకప్పుడు తెలుగు తెరపై తనదైన శైలిలో నవ్వుల పువ్వులు పూయించిన ఆ దర్శకుడు జంధ్యాల. నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అనే తన సిద్ధాంతాన్ని ఆచరణ లో పెట్టి.. తాను దర్శకత్వం వహించిన ప్రతీ సినిమాతోనూ ప్రేక్షకుల్ని నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు ఆయన. ఎలాంటి అశ్లీలతకు , అసభ్యతకు తావే లేకుండా.. ఆరోగ్యకరమైన హాస్యాన్ని మాత్రమే ప్రేక్షకులకు పంచారు జంధ్యాల.
జంధ్యాల పూర్తి పేరు వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి. 1951 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తితో పలు నాటకాలు రచించారు జంధ్యాల. కె.విశ్వనాథ్ ‘సిరిసిరి మువ్వ’ చిత్రంతో మాటల రచయితగా పరిచయమైన ఆయన.. ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో తీరికలేని రచయిత అయిపోయారు. అడవి రాముడు, వేటగాడు, లాంటి పక్కామాస్ చిత్రాలకి రచన చేసిన చేత్తోనే ‘శంకరాభరణం, సప్తపది’ లాంటి క్లాసిక్ మూవీస్ కి అద్భుతమైన సంభాషణలు రాసి.. సత్తా చాటుకున్నారు జంధ్యాల. ‘ముద్దమందారం’ చిత్రంతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి తొలి చిత్రంతోనే ఘన విజయం అందుకున్న జంధ్యాల ఆ తర్వాత ఎన్నో నవ్వుల రసగుళికలను తెలుగువారికి అందించారు. ‘నాలుగు స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, శ్రీవారి శోభనం, చూపులు కలిసిన శుభవేళ, మొగుడూ పెళ్ళాలు, బాబాయ్ అబ్బాయ్, చంటబ్బాయ్, అహనా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, విచిత్రం, హైహై నాయకా’, లాంటి చిత్రాలతో తెలుగు వారిని తన హాస్యంతో ఉక్కిరి బిక్కిరి చేశారు. బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, సుత్తి వీరభద్రరావు, సుత్తి వేలు లాంటి ఎందరో హాస్యనటుల్ని పరిచయం చేసి వారందరికి బంగారు బాట వేసిన జంధ్యాల జయంతి నేడు . ఈసందర్భంగా ఆ హాస్య బ్రహ్మకు ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.