మనిషి నిలువెత్తు విగ్రహం. తిండి పుష్టి కలిగిన శరీరం. భారమైన శరీరాన్ని కదిలిస్తూ.. నవ్వులు పూయించడం ఆయన మేనరిజం. టాలీవుడ్ వెండితెరమీద ఆయన పేరు ఐరెన్ లెగ్ శాస్త్రి. అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. పర్టిక్యులర్ గా ఇవివి సత్యనారాయణ ఆయన, బ్రహ్మానందం జంట మీద చిత్రీకరించిన కామెడీ…  సిరీస్ గా పలు చిత్రాల్లో హాస్యాన్ని పండించింది. వృత్తి పౌరోహిత్యమే అయినా.. ప్రవృత్తి సినీ రంగం అవడంతో  .. పలు చిత్రాల్లో ఆయన కామెడీ పాత్రలకు పెట్టింది పేరయ్యారు.

7వ తరగతి వరకూ చదివిన శాస్త్రి.. పౌరోహిత్యాన్ని వృత్తిగా చేపట్టారు. హైద్రాబాద్ లో సినిమా కార్యక్రమాల్ని , పూజల్ని జరిపించడం ప్రారంభించారు. ఒకసారి దర్శకుడు ఇవివి సత్యనారాయణ ఆయన ఫేస్ కట్టూ, ఆయన మేనరిజమ్స్ చూసి ‘ప్రేమఖైదీ’ చిత్రంతో తొలిసారిగా ఐరెన్ లెగ్ గా తెరమీద ఆవిష్కరించారు. ఆ పాత్ర బాగా పేలడంతో .. ఆ తర్వాత ఇవివి చిత్రాలు.. అప్పుల అప్పారావు, ఏవండీ ఆవిడ వచ్చింది, జంబలకిడి పంబ లాంటి చిత్రాల్లో కామెడీ పండించి మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. శాస్త్రి ఎక్కువగా ఐరెన్ లెగ్ పాత్రలే  చేయడం   ఆయన కెరీర్ కు నెగెటివ్ అయి కూర్చుంది. కారణం ఆయన ఐరెన్ లెగ్ గా బాగా పాపులర్ అవడంతో.. పెళ్ళిళ్ళకు, తదితర కార్యక్రమాలకు ఆయన నిజంగానే ఐరెన్ లెగ్గేనేమోనని భావించి  పిలవడం మానేశారు. ఫలితంగా ఐరెన్ లెగ్ శాస్త్రికి ఇటు వృత్తిపరంగానూ, అటు ప్రవృత్తి పరంగానూ ఎలాంటి అవకాశాలు లేక ఆయన ఆర్ధికంగా చాలా అవస్థలు పడ్డారు. ఆయనకి ఒక కుమారుడు ప్రసాద్. అతడు  కూడా కొన్నిషార్ట్ ఫిల్మ్స్ లోనూ  పలు చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్రలు పోషించాడు.  42 ఏళ్ళ వయసులో శాస్త్రి  కన్నుమూశారు. నేడు ఐరెన్ లెగ్ శాస్త్రి వర్ధంతి. ఈ సందర్భంగా ఆ నవ్వుల నటుడికి ఘన నివాళులర్పిస్తోంది మూవీ వాల్యూమ్.  

Leave a comment

error: Content is protected !!