మీరానాయర్ ‘సలాం బాంబే’ చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ ఖాన్ ఆ తర్వాత పలు హిందీ, బంగ్లాదేశ్ చిత్రాలతో పాపులరయ్యారు. స్లమ్ డాగ్ మిలీయనీర్, లైఫ్ ఆఫ్ పై, పజిల్, జురాసిక్ వరల్డ్, అమేజింగ్ స్పైడర్ మేన్ లాంటి ఇంగ్లీష్ చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతినార్జించారు. సైనికుడు తెలుగుచిత్రంలో విలన్ గా కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల అంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు ఇర్ఫాన్. చాలా రోజులనుంచి అరుదైన కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ రోజు ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇర్ఫాన్ వయసు 53 సంవత్సరాలు. ఆయనకు భార్య సుతాప, ఇద్దరు కుమారులు బబిల్, అయాన్ ఉన్నారు. ఇర్ఫాన్ 2018లో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని 2019 సెప్టెంబర్‌లో ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ముంబైలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. నిన్నటి నుంచి ఇర్ఫాన్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, బుధవారం ఆయన ఆరోగ్యం మరింత విషమించి మృతిచెందినట్టు ఇర్ఫాన్ కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం తెలియజేశారు.