తండ్రి శ్రీకాంత శర్మ పెద్ద సాహితీ వేత్త. తల్లి జానకీ బాల గొప్ప కథారచయిత. వీరిద్దరి లక్షణాలు పుణికిపుచ్చుకొని ఇటు సాహిత్యంలోనూ, అటు కథా రచనలోనూ పట్టుసాధించి.. వెండితెరమీదకు దార్శనికుడిగా అరుదెంచాడు ఇంద్రగంటి మోహన కృష్ణ. అందరు దర్శకుల్లా అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ ను తన సినిమాల్లో చొప్పించడు ఆయన. కథకు ఏది అవసరమనుకుంటే దాన్నే ఆవిష్కరిస్తాడు. తాను అనుకున్నదే తెరమీద సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే ఇప్పటివరకూ గొప్ప సక్సెస్ ల్ని ఏమీ చవిచూడలేదు ఆయన. కాకపోతే.. తన సినిమాలతో ఆలోచనల్ని చిగురింపచేస్తాడు. మంచి కథా వస్తువుంటే.. దాన్ని సమ్మోహనమైన రీతిలో వెండితెరమీదకు పంపిణీ చేయడంలో దిట్ట అనిపించుకున్నాడు.
‘గ్రహణం’ చిత్రంతో టాలీవుడ్ లో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. తొలి చిత్రానికే నంది పురస్కారం అందుకున్నాడు. మాయా బజార్, అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకు ముందు ఆ తర్వాత, బందిపోటు, జెంటిల్ మేన్, అమితుమీ, సమ్మోహనం.. త్వరలో నానీ, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో ‘వి’ చిత్రంతో రాబోతున్నాడు. మంచి కథలతో.. వ్యూహాత్మక, ఊహాత్మక ఆలోచనలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఆ సమ్మోహన కృష్ణుడి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.
హ్యాపీ బర్త్ డే ఇంద్రగంటి మోహన్ కృష్ణ